వైయస్ఆర్‌సీపీ గెల్చిన నియోజకవర్గాల్లో రాజ్యాంగం కల్పించిన హక్కులు కాలరాస్తూ, ఇన్‌ఛార్జీల పెత్తనం నడుస్తోందని ఆలూరు ఎమ్మెల్యే బూసినె విరూపాక్షి ఆక్షేపించారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ఐఏఎస్, ఐపీఎస్‌లే.. ఎమ్మెల్యేలుగా తమ హక్కులకు భంగం కలిగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇకనైనా అధికారులు రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాలని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే విరూపాక్షి కోరారు.
అయన మాట్లాడుతూ..... నా (ఆలూరు) నియోకవర్గంలో ఇటీవలే ఈరన్న అనే ఫీల్డ్ అసిస్టెంట్‌ను దారుణంగా నరికి చంపారు. ఒక పోస్టు కోసం ఆయన్ను హత్య చేశారని ప్రచారం జరిగింది. కూటమి పార్టీలకు చెందిన గుండాలు అలా అమాయక ప్రజల ప్రాణాలు తీస్తుంటే చంద్రబాబుకి కనీసం చీమ కుట్టినట్టయినా అనిపించడం లేదు. మరోవైపు మహిళలకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. వారిపై అత్యాచారాలు, నేరాలు నిత్యకృత్యంగా మారాయి. అయినా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు అని అన్నారు.