ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు అరుదైన గౌరవం లభించింది. రాజ్యాంగ బద్ధమైన పదవి ‘పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ కమిటీ’ చైర్మన్‌గా ఆయన నియమితులయ్యారు. రాష్ట్రంలో మూడు ఫైనాన్షియల్ కమిటీలకు చైర్మన్లను రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు నియమించగా.. అందులో కూన రవికి చోటు దక్కింది. ఆయనకు పదవి లభించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పీయూసీ కమిటీ అంటే.. ప్రభుత్వ రంగ సంస్థలపై పరిశీలన చేసేందుకు వీలుంటుంది.
రాష్ట్రంలో 52 ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. ఇందులో ఏపీఈపీడీసీఎల్, జెన్‌కో, మార్క్‌ఫెడ్, ఎస్‌పీడీసీఎల్, సీడ్ కార్పొరేషన్.. ఇలా ఆగ్రోస్ వంటివాటిపై పెట్టుబడులు, నియామకాలు.. ఆడిట్ అభ్యంతరాలు.. తీసుకున్న చర్యలు.. నిధులు వినియోగం.. దుర్వినియోగం వంటి వాటిపై పరిశీలన చేసి అసెంబ్లీకి నివేదిక ఇస్తారు. తదనంతరం ప్రభుత్వం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటుంది. ఈ విషయమై పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ ‘ఆంధ్రజ్యోతి’తో మంగళవారం రాత్రి మాట్లాడుతూ.. తనకు పీయూసీ చైర్మన్‌గా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.