పౌల్ర్టీ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేలా గత ప్రభుత్వం తెచ్చిన పౌల్ర్టీ పాలసీని పునఃసమీక్షించి, రాష్ట్రంలో పౌల్ర్టీ రంగాన్ని పునర్జీవింపచేయాలని ఏపీ పౌల్ర్టీ ఫెడరేషన్ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేసింది. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబును ఫెడరేషన్ అధ్యక్షుడు కె.సుబ్బారావు, ఉపాధ్యక్షుడు టి.కుటుంబరావు, సహాయ కార్యదర్శి పి.సుబ్బారెడ్డి, సభ్యులు జి.గంగాధరరావు, జి.సుబ్రహ్మణ్యం కలిశారు. రాష్ట్రంలో లేయర్ పౌల్ర్టీ ఫార్మర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి, సంక్షోభంలో ఉన్న పౌల్ర్టీ రంగానికి చేయూత అందించాలని కోరారు. కోళ్ల దాణాకు వినియోగించే మొక్కజొన్నపై దిగుమతి సుంకాన్ని పూర్తిగా మినహాయించేలా కేంద్రానికి లేఖ రాయాలని, మార్కెట్‌లో కోడిగుడ్ల ధరలను తారుమారు చేసే విధానాలను నియంత్రించడానికి పౌల్ర్టీ రైతులు, గుడ్డు వ్యాపారులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని, 2018-19లో పౌల్ర్టీ రైతులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.45.65 కోట్ల రాయితీ నిధులు విడుదల చేయాలని, రుణాలను ఏడాదిపాటు రీషెడ్యూల్ చేయాలని, ప్రతి జిల్లాలో కోళ్ల వ్యాధుల నిర్ధారణ, నివారణ చర్యలు చేపట్టాలని, కల్తీ మందుల నివారణ చట్టాలను కచ్చితంగా అమలు చేయాలని సీఎంకు ఇచ్చిన వినతిపత్రంలో కోరారు.