స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సోమవారం వాయిదా పడిన రెండు స్థానాలూ కూటమికే దక్కాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మునిసిపల్ చైర్ పర్సన్, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పీఠాలను టీడీపీ కైవసం చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మునిసిపల్ చైర్‌పర్సన్‌గా మండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు. సోమవారం జరగాల్సిన ఎన్నిక అనివార్య కారణాల వల్ల వాయిదా పడడంతో మంగళవారం నందిగామలోని జగ్జీవన్‌రామ్ భవన్‌లో చైర్‌పర్సన్ ఎన్నిక నిర్వహించారు. దీనికి 18 మంది కౌన్సిలర్లు, ఎక్స్ అఫిషియో సభ్యురాలి హోదాలో ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య హాజరయ్యారు. ఎన్నికల అధికారి, ఆర్డీవో కె. బాలకృష్ణ ఎన్నిక నిర్వహించారు. కూటమి అభ్యర్థిగా పదో వార్డుకు చెందిన మండవ కృష్ణకుమారి పేరును సౌమ్య ప్రతిపాదించారు. ఆమెకు మద్దతుగా 14 మంది కౌన్సిలర్లు, ఎక్స్‌అఫిషియో సభ్యురాలు ఓటు వేశారు. ఆమెకు మొత్తం 15 ఓట్లు వచ్చాయి. వైసీపీ తరఫున చైర్‌పర్సన్ బరిలో నిలిచిన ఓర్సు లక్ష్మికి మూడు ఓట్లు మాత్రమే వచ్చాయి. లక్ష్మి తన ఓటు తాను వేసుకోకుండా తటస్థంగా ఉండి పోయారు. మెజారిటీ సభ్యుల బలం ఉన్న మండవ కృష్ణకుమారి చైర్‌పర్సన్‌గా ఎన్నికైనట్టు ఆర్డీవో ప్రకటించారు. ఆమెకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.