టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో అరెస్టయి రిమాండులో ఉన్న నలుగురు నిందితుల కస్టడీ కోసం సిట్ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం తిరుపతి రెండో ఏడీఎం కోర్టులో విచారణ జరగనుంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న నేరారోపణతో ఏఆర్, వైష్ణవి, భోలేబాబా డెయిరీలకు చెందిన నలుగురు కీలక వ్యక్తులను సిట్ గత ఆదివారం రాత్రి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అదే రోజు అర్ధరాత్రి స్థానిక రెండో ఏడీఎం కోర్టు నిందితులు నలుగురికీ 11 రోజుల పాటు రిమాండ్ విధించడంతో తిరుపతి సబ్ జైలుకు తరలించారు.
మరుసటి రోజు సోమవారం సిట్ అధికారులు నిందితులు రాజశేఖరన్, పొమిల్ జైన్, విపిన్ జైన్, అపూర్వ వినయ్‌కాంత్ చావడాలను విచారణ నిమిత్తం కస్టడీకి తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై రెండో ఏడీఎం కోర్టు గురువారం విచారణ చేపట్టనుంది. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ వారం రోజుల్లో తిరుపతికి వచ్చే అవకాశాలున్నాయి. తిరుపతిలోని సిట్ అధికారులతో బుధవారం సీబీఐ చీఫ్ వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసు పురోగతిపై ఆరా తీశారు. ఈ సమీక్ష సందర్భంగా... ఏఆర్ డెయిరీ నుంచి నెయ్యి సరఫరాకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్న టీటీడీ మునుపటి ముఖ్యులను ప్రశ్నించే అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది.
సీబీఐ డైరెక్టర్ తాజా సమీక్ష, కొద్ది రోజుల్లో ఆయనే స్వయంగా తిరుపతికి వచ్చే అవకాశాలున్న దృష్ట్యా కల్తీ నెయ్యి సరఫరా కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయని ప్రచారం జరుగుతోంది. టీటీడీకి సంబంధించిన మునుపటి కీలక అధికారిని అదుపులోకి తీసుకుని విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి సేకరణకు సంబంధించిన టెండరు నిబంధనలను ఎందుకు సడలించాల్సి వచ్చింది.. తక్కువ ధరకు కోట్ చేసిన నెయ్యిని ఎలా కొనుగోలు చేశారు.. బహిరంగ మార్కెట్లో నెయ్యి ధర ఎక్కువ ఉండగా తక్కువకు సరఫరా చేయడం ఎలా సాధ్యం? తక్కువకు సరఫరా అంటే నాణ్యతలో రాజీ పడినట్టే కదా? అన్న అంశాలపై ప్రశ్నించాలని సిట్ భావిస్తున్నట్టు సమాచారం.
![]() |
![]() |