ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం మొర్సుమల్లి శివారు ములకలపెంట గ్రామంలో ఈ నెల 8న జరిగిన జరిగిన కడియం శ్రీనివాసరావు మర్దర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. నిందితుడు కడియం పుల్లారావును శుక్రవారం మైలవరం పోలీస్ స్టేషన్‌లో ఏసీపీ ప్రసాదరావు మీడియా ముందు ఉంచి వివరాలు వెల్లడించారు. పుల్లారావు ఆన్‌లైన్ బెట్టింగులు, షేర్ మార్కెట్‌లో డబ్బులు పెట్టి అప్పుల పాలయ్యాడు. వాటిని తీర్చేందుకు ఆస్తి అమ్మాలని తండ్రి కడియం శ్రీనివాసరావుపై ఒత్తిడి చేస్తున్నాడు. ఆయన ససేమిరా అనడంతో ఈ నెల 8న తండ్రి పొలంలో ఉండగా ఆయనను కర్రతో తల పగలగొట్టి హత్యచేశాడు. సరిహద్దు వివాదం ఉన్న చల్లా సుబ్బారావు, అతడి అనుచరుడే తన తండ్రిని హత్య చేశారని అందరినీ నమ్మించాడు. అయితే, పోలీసు దర్యాప్తులో సెల్ సిగ్నల్ ఆధారంగా పుల్లారావే నిందితుడిగా నిర్ధారించారు. మనిషి ఒక్క దెబ్బతో ఎలా చనిపోతారో తెలుసుకునేందుకు యూట్యూబ్‌లో పలు నేర కథనాలను చూసి, చివరికి తలపై కర్రతో కొట్టి చంపినట్లు విచారణలోతెలిపాడు. దీంతోఅతడిని అరెస్టుచేసి మైలవరం కోర్టుకు తరలించినట్లు సీఐ దాడి చంద్రశేఖర్ తెలిపారు.
![]() |
![]() |