దేవుళ్లంతా సరిగ్గానే ఉన్నారని, కొందరు మనుషుల మనస్తత్వాలే తేడాగా ఉన్నాయంటూ మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం కటువైన వ్యాఖ్యలు చేసింది. మదురై జిల్లా తిరుప్పరంకుండ్రం పర్వతానికి సంబంధించిన దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ఇలా స్పందించింది. తిరుప్పరంగుండ్రాన్ని‘జైన కొండ’గా ప్రకటించాలని కోరుతూ విల్లుపురం స్వస్తిశ్రీ లక్ష్మీసేన స్వామి పిటిషన్ దాఖలు చేసింది. ఇది జాతీయ ప్రాముఖ్యత కలిగిన పర్వతమని, జైనులతో దీనికి సంబంధం ఉందని, కాబట్టి జైన కొండగా ప్రకటించాలని అభ్యర్థించారు. అంతేకాదు, జైనమత విశ్వాసాలకు విరుద్ధంగా కొండపై జరిగే కార్యకలాపాలు నిషేధించాలని కోరారు. తిరుప్పరంగుండ్రం కొండను పునరుద్ధరించి.. రక్షించేలా ఉత్తర్వులు వెలువరించాలని విజ్ఞప్తి చేశారు.
దీంతో పాటుగా తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న సికిందర్ బాషా దర్గాలో నిర్వాహకులు జంతు బలులు, మాంసాహారం వండి, వడ్డించడంపై నిషేధం విధించాలని చోళై అళగుపురానికి చెందిన చోలైకన్నన్.. కొండపై నెల్లితోపు ప్రాంతంలో ముస్లింల ప్రార్థనలు, ఇతర కార్యక్రమాలను నిషేధించాలని కోరుతూ రామలింగం అనే వ్యక్తులు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ పిటిషన్లపై మదురై ధర్మాసనంలోని న్యాయమూర్తులు జస్టిస్ జె.నిషాభాను, జస్టిస్ ఎస్.శ్రీమతి సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా మదురై జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్‌లు కౌంటర్ అఫిడవిట్లు వేశారు. తిరుప్పరంగుండ్రం కొండ చుట్టూ ఉన్న ఆలయాల్లో జంతు బలులివ్వడం ఆచారంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. కొండ ఉత్తరం వైపున మురుగన్ ఆలయం, దక్షిణం వైపున జైన చిహ్నాలు, మధ్యలో దర్గా ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాంతాన్ని హిందువులు ‘స్కందమలై’ అంటే, ముస్లింలు ‘సికిందర్ హిల్’ అని, జైనులు ‘జైన హిల్’ అని, స్థానికులు ‘తిరుప్పరంకుండ్రం కొండ’ అని పిలుస్తుంటారని వివరించారు.
అన్ని మతాల మధ్య ఐక్యత, సామరస్యం నెలకొనాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని, ఇందులో బాగంగా జనవరి 30వ ఇరు మతాల మధ్య శాంతి సమావేశం నిర్వహించామని తెలిపారు. దర్గాకు వచ్చిన వారి కోర్కెలు నెరవేరితే మేకలు, కోళ్లు బలిచ్చి మొక్కులు చెల్లించుకుంటారని చెప్పారు. ప్రస్తుతం ఉన్న పూజా విధానాలనే కొనసాగించాలని, బయటవాళ్లు జోక్యం చేసుకోరాదని, ఈ విషయంలో గందరగోళం సృష్టించరాదని ఆ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించినట్లు వివరించారు. .
కేవలం ముస్లింలు మాత్రమే కాకుండా ఇతర మతాలకు చెందినవారు తమ కోర్కెలు ఫలిస్తే మేకలు, కోళ్లను బలిచ్చి.. అక్కడే వండుకుని కలసి భోజనం చేసే ఆనవాయితీ కూడా ఉందన్నారు. అలాగే, ప్రార్థనా స్థలాల చట్టం 1991 ప్రకారం 1947 ఆగస్టు 15 నాటికి ముందున్న యథాతథస్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు తేల్చిచెప్పిందని ఇందులో గుర్తు చేశారు. తిరుప్పరంకుండ్రం సమస్యకు పరిష్కారం లభించిందని ప్రభుత్వం తరఫున హాజరైన లాయర్ వివరించారు. ఈ కొండ నిర్వహణ పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉందని, ఏదైనా చేయాలంటే వారి నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలకు కొంత సమయం ఇవ్వాలని ఆర్కియాలజీ విభాగం తరఫు లాయర్ విజ్ఞప్తి చేశారు.
అయితే, ఈ వివాదంపై 1923లో మదురై ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను బ్రిటిష్ కౌన్సిల్ ధ్రువీకరించిందని పిటిషనర్లు తరఫున లాయర్ తెలియజేశారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ. తిరుప్పరంకుండ్రం అందరికీ సొంతమైందని పేర్కొంది. దేవుళ్లు అందరూ సక్రమంగానే ఉన్నారని... కొందరు మనుషులు మాత్రం సరిగా లేరని వ్యాఖ్యానించింది. అనంతరం కేసు విచారణను ఏప్రిల్ 7కు వాయిదావేసింది.
![]() |
![]() |