రోడ్లపై వాహనాన్ని నడపాలంటే కొన్ని ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. బైక్, కారు, లారీ, బస్సు.. ఏ ఇతర వాహనం అయినా.. కొన్ని నియమ నిబంధనలకు అనుగుణంగా రోడ్డుపై నడపాల్సి ఉంటుంది. అలా ట్రాఫిక్ నియమాలు పాటించినప్పుడే రోడ్లపై యాక్సిడెంట్లు కాకుండా అడ్డుకోవచ్చు. అయితే రోడ్లపై ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు భారీగా జరిమానాలు విధిస్తూ షాక్ ఇస్తూ ఉంటారు. అయితే తాజాగా ఓ వ్యక్తి బైక్‌పై వెళ్తూ హెల్మెట్ పెట్టుకోకపోవడంతో ఫైన్ వేశారు. హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ నడిపితే అన్ని ట్యాక్సులు కలిపి మొత్తంగా ఓ రూ.250, రూ.500 వరకు వేస్తూ ఉంటారు. కానీ ఆ వ్యక్తికి మాత్రం ఏకంగా రూ.10 లక్షల ట్రాఫిక్ చలాన్ వేయడంతో అది చూసి గుండె ఆగినంత పనైంది.
గుజరాత్ అహ్మదాబాద్ నగరంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అహ్మదాబాద్ శాంతిపుర ట్రాఫిక్ సిగ్నల్ వద్ద.. అనిల్ హదియా అనే లా స్టూడెంట్ తన బైక్‌ను హెల్మెట్ లేకుండా నడుపుతూ ట్రాఫిక్ పోలీసుల కంటికి చిక్కాడు. గతేడాది ఏప్రిల్ నెలలో జరిగిన ఈ సంఘటనలో అనిల్ హదియా బైక్ ఫోటో తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఆ బైక్ నంబర్‌పై చలాన్ విధించారు. అయితే హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపినందుకు అతనికి విధించాల్సిన జరిమానా రూ. 500 కాగా.. ట్రాఫిక్ పోలీసులు పొరపాటుగా రూ.10,00,500గా ఎంట్రీ చేశారు.
అయితే తన బైక్‌పై ఉన్న ట్రాఫిక్ చలాన్ల గురించి ఆ తర్వాత తాను మర్చిపోయినట్లు అనిల్ హదియా వెల్లడించాడు. ఇటీవల ఆ బైక్ పని కోసం ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్‌కు వెళ్లగా.. తన బండిపై 4 చలాన్లు ఉన్నాయని వాటిని చెల్లించాలని అధికారులు చెప్పినట్లు పేర్కొన్నాడు. దీంతో 3 చలాన్లు చెల్లించగా.. నాలుగో చలాన్ కట్టడానికి వీలు పడలేదు. అయితే ఈనెల 8వ తేదీన ఓధవ్ పోలీసుల ద్వారా స్థానిక కోర్టు నుంచి సమన్లు జారీ అయినట్లు తెలిపాడు. అయితే ట్రాన్స్‌పోర్ట్ పోర్టల్‌లోకి వెళ్లి చూడగా.. తన బైక్‌పై రూ.500కు బదులుగా రూ.10,00,500 చలాన్ ఉన్నట్లు కనిపించిందని అనిల్ హదియా చెప్పాడు. అది చూసి తాను అవాక్కయ్యానని వెల్లడించాడు.
ట్రాఫిక్ చలాన్ ఎంట్రీ చేసే సమయంలో టైపింగ్ లోపం కారణంగా ఈ పొరపాటు జరిగిందని స్థానిక ట్రాఫిక్ పోలీసులు అంగీకరించారు. తాను హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ నడపడం చూసి ట్రాఫిక్ పోలీసులు.. ఫోటో తీసుకుని చలాన్ జారీ చేశారని.. దానిపై రూ.10,00,500 ఫైన్ విధించారని అనిల్ హదియా తెలిపాడు. తాను లా చదివే విద్యార్థిని అని.. తన తండ్రి ఒక చిన్న బిజినెస్ చేసి కుటుంబాన్ని పోషిస్తాడని పేర్కొన్నాడు. రూ.10 లక్షలు చెల్లించాలని కోర్టు సమన్లు జారీ చేస్తే.. తాము ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలని అనిల్ హదియా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై బాధితుడు అనిల్ హదియా మెట్రోపాలిటన్ కోర్టును ఆశ్రయించాడు. అయితే ఆ చలాన్‌లో ఏదో లోపం ఉందని.. తాము దాన్ని కోర్టుకు తెలియజేసి సరిదిద్దుతామని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) ఎన్ఎన్ చౌదరి చెప్పారు.
![]() |
![]() |