మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ రామగిరి పర్యటనలో పోలీసుల భద్రతా వైఫల్యం ప్రస్పుటమైందని ఎమ్మెల్సీ, వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం ఇన్‌చార్జీ లేళ్ళ అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రామగిరిలో హెలికాఫ్టర్ విండ్‌షీల్ట్ ధ్వంసంపై పలు అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. ముందుస్తు సమాచారంతోనే వైయస్ జగన్ పర్యటించినా పోలీసులు కనీస బందోబస్త్ కూడా ఏర్పాటు చేయకపోవడం వెనుక కుట్ర ఉందా అనే సందేహం కలుగుతోందని అన్నారు. అయన మాట్లాడుతూ..... ఇటీవల రామగిరి ఎంపీపీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన దౌర్జన్యాలు, అరాచకాల నేపథ్యంలో పాపిరెడ్డిపల్లిలో వైయస్ఆర్‌సీపీ నాయకుడు కురుబ లింగమయ్య దారుణ హత్యకు గురయ్యాడు. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ గారు పాపిరెడ్డిపల్లికి వెళ్ళారు. ఆయన పర్యటనలో రాష్ట్రప్రభుత్వ వైఖరీ, పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. హెలికాఫ్టర్‌లో జగన్ గారు ఆ ప్రాంతానికి వెళితే , హెలిప్యాడ్‌లో నిలిచిఉన్న హెలికాఫ్టర్ విండ్ షీల్డ్ పగిలిపోయిందంటే పోలీసులు ఏ మేరకు భద్రత కల్పించారో అర్థం చేసుకోవచ్చు. రెండు రోజుల ముందే ఈ పర్యటన ఉంటుందని అన్ని ప్రభుత్వ విభాగాలకు సమాచారం ఇచ్చి, అనుమతులు తీసుకున్న తరువాతే హెలికాఫ్టర్‌లో అక్కడికి వెళ్ళారు. హెలిప్యాడ్‌కు భద్రత కల్పించాల్సిన పోలీస్ అధికారులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మాజీ సీఎం, దేశంలోనే అత్యంత ప్రజాధరణ కలిగిన నాయకుడుగా వైయస్ జగన్ పర్యటనకు వెడుతుంటే ఏ మేరకు భద్రత కల్పించాలనే అంచనా పోలీస్ యంత్రాంగానికి లేదా? కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలోని నాయకుడికి కల్పించే భద్రత ఇదేనా? ఒక మాజీ సీఎంకే రక్షణ కల్పించలేకపోతే రాష్ట్రంలో సామాన్యులకు ఏం రక్షణ కల్పించగలరు? అని ప్రశ్నించారు.
![]() |
![]() |