కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చేసిందని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పచ్చచొక్కాలకు జేబులు నింపే కార్యక్రమంగా కూటమి ప్రభుత్వం మద్యం పాలసీని అమలు చేస్తోందని మండిపడ్డారు. ఎమ్మెల్యేల నుంచి మొదలు ప్రభుత్వ అధినేతల వరకు మద్యం ముడుపులతో సంపదను సృష్టించుకుంటున్నారని ధ్వజమెత్తారు. వైయస్ఆర్‌సీపీ పాలనలో కల్తీ మద్యం అంటూ విష ప్రచారం చేసిన కూటమి పార్టీలు ఈ పదినెలల్లో ఒక్క తప్పును కూడా ఎందుకు చూపించలేక పోయాయని నిలదీశారు. అయన మాట్లాడుతూ.... గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన మద్యం పాలసీపై ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు విషం చిమ్మాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లు బూటకపు ఆరోపణలతో విపరీతమైన తప్పుడు ప్రచారం చేశారు. వైయస్ఆర్‌సీపీపై విషం చిమ్మిన కూటమి నేతలు గడిచిన పదినెలలుగా వారి ప్రభుత్వంలో అదే మద్యాన్ని విక్రయిస్తున్నారు. గ్రామాల్లోని పచ్చచొక్కా నాయకులు మొదలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వ అధినేతలు నీతి, లజ్జ లేకుండా మద్యాన్ని పాడికుండలా మార్చుకున్నారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఆఖరి ఏడాదిలో మరీ నీచంగా ప్రభుత్వమే కల్తీ మద్యాన్ని వినియోగదారులకు అమ్ముతోందని వారు నిస్సిగ్గుగా అబద్దాలు మాట్లాడారు. ఎల్లో మీడియా ద్వారా దీనిని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగారు. ఇదే నిజమైతే వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం దిగిపోయే జూన్ 2024 నాటికి, అప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గోడవున్‌ల్లోని మద్యంను ఎందుకు సీజ్ చేయలేదు? కల్తీ జరిగిందన్న కూటమి పార్టీ నేతలు మద్యం శాంపిళ్ళను పరీక్షించేందుకు ఎందుకు ల్యాబ్‌లకు పంపలేదు? అదే మద్యాన్ని ఎలా షాప్‌లకు తరలించి విక్రయాలు చేశారు? అంటే గతంలో రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు చేసిన తిరుపతి లడ్డూలో కల్తీ, రూ.14 లక్షల కోట్ల అప్పులు ఎలా అబద్దాలో మద్యంలో కల్తీ కూడా ఒక అబద్దమే అని అన్నారు.
![]() |
![]() |