ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాట్సాప్ వాడేవారికి బీ అలర్ట్.. కొత్తగా వెడ్డింగ్ ఇన్విటేషన్ స్కామ్‌

national |  Suryaa Desk  | Published : Sat, Aug 23, 2025, 08:41 PM

వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్. ఇప్పుడు సైబర్ కేటుగాళ్లు.. సరికొత్త రకం మోసాలతో అమాయకులను బురిడీ కొట్టించి.. అందినకాడికి దోచుకుంటున్నారు. ప్రస్తుతం వాట్సాప్‌లో వెడ్డింగ్ ఇన్విటేషన్ పేరుతో భారీ స్కామ్‌కు తెరలేపారు. అయితే బ్యాంక్ అకౌంట్ మొత్తం ఖాళీ అయ్యాక గానీ.. బాధితులకు తాము సైబర్ నేరగాళ్ల వలలో పడ్డామని అర్థం కావడం లేదు. ఓటీపీ, పిన్ నంబర్, బ్యాంక్ అకౌంట్ ఏమీ లేకుండానే.. ఒక్క లింక్‌ పంపించి.. అది ఓపెన్ చేయగానే.. ఫోన్‌లో ఉన్న మొత్తం డేటాను సేకరించి.. దాని ద్వారా స్మార్ట్‌గా డబ్బులు కొట్టేస్తున్నారు. పెళ్లికి రండి అంటూ ఆహ్వానం పంపించి.. అది క్లిక్ చేయగానే.. ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలో ఒక ప్రభుత్వ ఉద్యోగికి వాట్సాప్‌లో ఇలాంటి వెడ్డింగ్ ఇన్విటేషన్ లింక్ రాగా.. అతడు దాన్ని ఓపెన్ చేయడంతో.. అకౌంట్‌లో ఉన్న రూ.1.90 లక్షలు కట్ అయ్యాయి. దీంతో అతడు.. సైబర్ పోలీసులను ఆశ్రయించాడు.


మహారాష్ట్రలోని హింగోలీకి చెందిన ప్రభుత్వ ఉద్యోగి.. ఈ వాట్సాప్ వెడ్డింగ్ స్కామ్‌కు బలయ్యారు. ఆగస్ట్ 30వ తేదీన పెళ్లి ఉందంటూ ఆ గవర్నమెంట్ ఉద్యోగికి.. వాట్సాప్‌లో ఒక మెసేజ్ వచ్చింది. ‘‘వెల్‌కమ్.. షాదీ మే జరూర్ ఆయే (పెళ్లికి తప్పక రండి). 30/08/2025" అని రాసి ఉంది. దాని కింద ఒక పీడీఎఫ్ ఫైల్ రూపంలో పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు ఉన్నట్లు కనిపించింది. అది ఒక ఆండ్రాయిడ్‌ అప్లికేషన్‌ ప్యాకేజీ (ఏపీకే). అయితే ఎవరో పెళ్లి ఇన్విటేషన్ పంపించారని భావించిన ఆ ఉద్యోగి.. ఆ ఏపీకే ఫైల్‌ను క్లిక్‌ చేయగానే.. అతడి ఫోన్‌లో ఉన్న డేటా మొత్తం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయింది.


దీంతో వెంటనే ఆ ఉద్యోగి అకౌంట్‌లో నుంచి రూ.1.90 లక్షలు కొట్టేశారు. ఆ తర్వాత అసలు విషయం అర్థం చేసుకున్న బాధితుడు.. వెంటనే దగ్గర్లో ఉన్న హింగోలీ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో ప్రస్తుతం సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ వాట్స్పా వెడ్డింగ్ ఇన్విటేషన్ స్కామ్ గతేడాదే వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఈ స్కామ్ కింద చాలా మంది తమ డబ్బును పోగొట్టుకున్నారని పోలీసులు వెల్లడించారు.


సాధారణంగా ఇలాంటి స్కామ్ చేసే సైబర్‌ నేరగాళ్లు.. గుర్తుతెలియని నంబర్లు, అకౌంట్ల నుంచి వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు వెడ్డింగ్ కార్డ్స్, డాక్యుమెంట్లు, వీడియోలు, లింకులు, ఏపీకే ఫైళ్లు వంటివి పంపిస్తారు. అయితే అందులో ఏముంది, ఎవరు పంపించారని.. వాటిపై మనం క్లిక్‌ చేస్తే.. మన ప్రమేయం లేకుండానే ఫోన్‌లో ఏపీకే ఫైల్‌ రూపంలో ఉండే ఒక యాప్‌ డౌన్‌లోడ్‌ అవుతుందని సైబర్ పోలీసులు వెల్లడించారు.


ఫోన్‌లో ఉండే ఫోటోగ్యాలరీ, యాప్‌లు, ఇతర డేటా అంతా ఆ ఏపీకే ఫైల్ సేకరించి.. సైబర్ నేరగాళ్లకు అందిస్తుంది. ఇలాంటి డేంజర్ ఫైల్స్ సాఫ్ట్‌వేర్‌లు మన ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ అయితే ఫోన్‌ హ్యాక్‌ అవుతుంది. దీని వల్ల సైబర్ నేరగాళ్లు.. మన ఫోన్‌ మొత్తాన్ని వారి కంట్రోల్‌లోకి తీసుకుని.. బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకుంటారు. అంతేకాకుండా ఫోన్, ల్యాప్‌టాప్, కంప్యూటర్‌లలోని పర్సనల్ ఫొటోలు, ఇతర డేటాను కూడా సేకరించి.. బెదిరించడం వంటివి చేస్తారు. ఇలాంటి వాటి బారిన పడకుండా అలర్ట్‌గా ఉండాలని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు.


 మన ఫోన్‌కు ఏదైనా ఫైల్‌ వచ్చినప్పుడు.. దాని చివర్లో అది ఏ ఫైల్ అనేది ఉంటుంది. ఉదాహరణకు వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌ పేరుతో వచ్చే పీడీఎఫ్‌ ఫైల్‌ చివర్లో ‘వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌.పీడీఎఫ్‌’ అని.. అది ఏపీకే ఫైల్‌ అయితే ‘వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌.ఏపీకే’ అని ఇంగ్లీష్ అక్షరాలు ఉంటాయి. ఒకవేళ అది ఏపీకే ఫైల్ అయితే దాన్ని అస్సలు డౌన్‌లోడ్‌ చేయవద్దని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. మనకు తెలిసిన వారు ఇలాంటి లింక్‌లు పంపించినా.. వాటిని ఒకసారి చెక్ చేసిన తర్వాతే దాన్ని ఓపెన్ చేయాలి. ఏపీకే ఫైళ్లపై క్లిక్‌ చేసినప్పుడు.. డేంజర్ ఫైల్ అని స్ర్కీ్న్‌పై కనిపిస్తే.. దాన్ని వెంటనే క్యాన్సిల్ చేయాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa