పంట భూములకు సంబంధించి చేసిన ఈ - క్రాప్ నమోదుపై జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి బొండపల్లిలో సోమవారం సూపర్ చెకింగ్ చేశారు. బొండపల్లి తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లిన ఆమె స్థానిక రైతుల సమక్షంలో అధికారులను ఆరా తీశారు. ఈ-క్రాప్ నమోదు, ధాన్యం కొనుగోలు, ఇతర సేవలపై రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు ప్రభుత్వం, అధికారుల నుంచి అందుతున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా కొన్ని చోట్ల మిగులు ధాన్యం ఉండిపోయిందని ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. ప్రత్యేక యాప్ ద్వారా రైతుల నుంచి వివరాలు సేకరించి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బదులిచ్చారు.
బొండపల్లి పరిధిలో ఇప్పటి వరకు జరిగిన ఈ - క్రాప్ బుకింగ్, రైతుల నుంచి సేకరించిన ధాన్యం గురించి రైతుల సమక్షంలోనే సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. వచ్చే సీజన్‌కు ముందుగానే స్థానిక పరిస్థితులకు, వాతావరణానికి అనువైన ఇతర ప్రత్యామ్నాయ పంటలను అనుసరించేలా రైతులను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. రైతులు కూడా అధికారులకు, సిబ్బందికి తగిన విధంగా సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సాధారణ రకాల విత్తనాలను కాకుండా నాణ్యమైన కొత్తరకం వంగడాలను వినియోగించాలని, పంటల మార్పిడిపై రైతులు దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. ఆమె వెంట స్థానిక తహశీల్దార్ శ్రీనివాస్ మిశ్రా, వ్యవసాయ అధికారి మల్లిఖార్జున, స్థానిక అధికారులు సిబ్బంది, తదితరులు ఉన్నారు.