పాలకొల్లులో ఓ ఆంబోతు భవనంపైకి ఎక్కింది.. ఫస్ట్ ఫ్లోర్ వరకు వెళ్లింది. ఎక్కడం చాలా ఈజీనే.. కానీ దిగడానికే నానా తిప్పలు పెట్టింది.. ఏకంగా 12 గంటల పాటూ కష్టపడి కిందకు దింపారు. స్థానికులు ఈ సీన్ చూసి ఆశ్చర్యపోయారు.. మొబైల్స్‌లో వీడియోను రికార్డు చేయగా.. వీడియో వైరల్ అవుతోంది. వర్షం దెబ్బకు, చలితో ఆంబోతు ఇలా భవనంపైకి ఎక్కినట్లు స్థానికులు చెబుతున్నారు.
పాలకొల్లులో బిల్డింగ్ ఎక్కిన ఆంబోతు.. వీడియో వైరల్
ఇదిలావుంటే పశ్చిమగోదావరి జిల్లాలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి.. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జోరు వానలకు అక్కడక్కడా రోడ్లపై కూడా నీళ్లు నిలబడిపోయాయి. ఆవులు, ఇతర జంతువులు రోడ్డు పక్కన పడుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఈ క్రమంలో పాలకొల్లు రామగుండం సెంటర్‌లో కోర్టు సెంటర్‌లో ఓ ఆంబోతు బిల్డింగ్‌పైకి ఎక్కింది. అక్కడ మెట్లు గేటు తీసే ఉండటంతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్లి తిష్ట వేసింది. కారిడార్‌లోకి వెళ్లాక ఎటు వెళ్లాలో తెలియలేదు.. అలాగని వెనక్కి వెళ్లి మెట్లు దిగటానికి శరీరం కూడా సహకరించలేదు.
దీంతో ఆంబోతు సుమారు 12 గంటల పాటూ అలాగే అక్కడే నిలబడి ఉంది. బయట జోరు వాన, చలి గాలులు, మేత, నీళ్లు లేకుండా ఉండిపోవాల్సి వచ్చింది. ఆంబోతును అలా రోడ్డు పక్కన భవనం ఫస్ట్ ఫ్లోర్‌లో చూసి స్థానికులు అవాక్కయ్యారు. ఆంబోతును గమనించిన స్థానిక యానిమల్ వారియర్ కన్జర్వెన్సీ సోసైటీ సభ్యులు అక్కడికి వచ్చి కిందకు దింపాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అక్కడే ఉన్న గదుల తాళాలు తెప్పించి వాటి తలుపులు తీసి అతి కష్టం మీద జాగ్రత్తగా పై ఫ్లోర్ నుండి కిందకి మెట్లు గుండా దింపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు ఆంబోతు అలా భవనం కారిడార్‌లో నిలబడి ఉన్న వీడియోను తమ మొబైల్స్‌లో రికార్డు చేయగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వాస్తవానికి రోడ్లపై, వీధుల్లో తిరిగే మూగ జీవాలు మార్కెట్‌లోకి వెళ్లి మిగిలిన కూరగాయలు తిని అక్కడే రోడ్ల పక్కన పడుకునేవి. అలాగే వీధుల్లో అయితే కొందరు స్థానికులు అరటి పళ్లు ఆహారం అందించేవాళ్లు. అలాగే మార్కెట్‌లలో కొందరు షాప్‌ల యజమానులు, స్థానికులు మిగిలిన కూరగాయల్ని అందించేవారు. అలా వాటిని తిని రోడ్లు పక్కన ఉన్న చెట్ల కింద సేద తీరేవి. కానీ వర్షం కారణంగా మూగ జీవాలకు ఆవాసం లేకుండా పోయింది. అందుకే ఈ ఆంబోతు అలా భవనంపైకి ఎక్కిందంటున్నారు.