ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా, రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ఆగస్టు 14న సెలవు ఉంటుందని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం తెలిపింది. భారీ వర్షాల కారణంగా విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆగస్టు 14న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని విద్యాశాఖ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల జరిగిన నష్టంపై ముఖ్యమంత్రి అన్ని జిల్లాల కలెక్టర్ల (డీసీ) నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. రోడ్డు మార్గాల మూసివేత గురించి కూడా అతనికి సమాచారం వచ్చింది. అలాగే కొండచరియలు విరిగిపడి ఇళ్లకు జరిగిన నష్టం గురించి తెలుసుకున్నారు. భారీ వర్షాల కారణంగా ఏర్పడిన పరిస్థితులపై నిఘా ఉంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శితో పాటు అన్ని డీసీలను సీఎం ఆదేశించారు. పాలనా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, రోడ్లు, విద్యుత్తు, మంచినీటి ఏర్పాట్లను సజావుగా నిర్వహించాలని తెలిపారు.