వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో విజయం సాధించి వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్లాలని బీజేపీ, కాంగ్రెస్ సహా అన్ని ప్రాంతీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉన్న పథకాలకు తోడు కొత్త పథకాలు, హామీలను ప్రజలపై గుప్పిస్తున్నాయి. మరోవైపు.. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఆయా రాష్ట్రాల్లో ఓటర్లను ఆకర్షించేందుకు నేతలు ఇస్తున్న హామీలు సంచలనంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. కీలక ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వస్తే ఉచితంగా అయోధ్య రాముడి దర్శనం కల్పిస్తామని ప్రకటించారు.
విదిశలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షాలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే ఎలాంటి ఖర్చు లేకుండా మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అయోధ్య రామ మందిర దర్శనం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే మధ్యప్రదేశ్ ప్రజలందరినీ దశల వారీగా అయోధ్య రామ మందిరానికి తీసుకెళ్తామని అమిత్ షా స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ హామీని ప్రకటించామని వెల్లడించారు. గతంలో తాను బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నపుడు.. రామ మందిర నిర్మాణం ఎప్పుడు పూర్తి అవుతుందని.. రామాలయ ప్రారంభోత్సవ తేదీ ఎప్పుడు అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పదే పదే అడిగేవారని గుర్తు చేసుకున్నారు. ఆ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చెబుతున్నానని పేర్కొన్న అమిత్ షా.. 2024 జనవరి 22 న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీపై అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్ నాథ్, రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్.. వచ్చే ఎన్నికల్లో వారి వారసులను సీఎం చేయాలనే ప్రణాళికలు చేసుకుంటున్నారని ఆరోపించారు. మరోవైపు.. తన కుమారుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని సోనియా గాంధీ చూస్తున్నారని ఎద్దేవా చేశారు. తమ కొడుకులు, కుమార్తెల కోసం మాత్రమే రాజకీయాల్లో ఉన్న వారు ప్రజలకు ఎలా సేవ చేస్తారని అమిత్ షా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఇటీవలె మేనిఫెస్టోను ప్రకటించింది. ఆ మేనిఫేస్టోలో రూ.450 కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని.. పేద కుటుంబాలకు చెందిన ఆడ పిల్లలకు పీజీ వరకు ఉచిత విద్య కల్పిస్తామని చెప్పింది. ఇక ఈనెల 17 వ తేదీన మధ్యప్రదేశ్‌లో ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే బుధవారంతో మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది.