పశ్చిమ బెంగాల్‌లోని ఓ ఆస్పత్రిలో వరుసగా చిన్నారులు మరణించడం తీవ్ర కలకలం రేపుతోంది. 24 గంటల వ్యవధిలోనే 9 మంది అప్పుడే పుట్టిన శిశువులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ 9 మంది నవజాత శిశువులతోపాటు మరో 2 ఏళ్ల చిన్నారి కూడా చనిపోవడం తెగ సంచలనంగా మారింది. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీలో చోటు చేసుకున్న ఈ దుర్ఘటన పట్ల ఆ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఘటనను చాలా సీరియస్‌గా తీసుకున్న మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ సర్కార్.. ఈ మరణాలకు గల కారణాలను గుర్తించేందుకు హుటాహుటిన ఒక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది.
అయితే ప్రాథమికంగా వస్తున్న నివేదికల ప్రకారం.. ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ చనిపోయిన ఆ చిన్నారులంతా పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఆ శిశువులు అతి తక్కువ బరువు ఉన్నారని.. అందులో ఒకరు తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. అయితే అక్కడ చనిపోయిన 9 మంది శిశువుల్లో ముగ్గురు ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీలో పుట్టారని.. మిగిలిన వారు ఆ ఆస్పత్రి చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ఆస్పత్రుల్లో జన్మించారని ముర్షిదాబాద్ మెడికల్ కాలేజ్ వర్గాలు వెల్లడించాయి. వివిధ ఆస్పత్రుల్లో జన్మించిన ఆ శిశువుల ఆరోగ్యం క్షీణించి పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ముర్షిదాబాద్ మెడికల్ కాలేజ్‌కు తరలించినట్లు తెలిపారు. అయితే ఆ శిశువులకు చికిత్స అందించేందుకు కొంత సమయం కావాల్సి ఉండేదని.. అయితే అప్పటికే వారు ఆలస్యంగా ఆస్పత్రికి తీసుకురావడంతో వారి ప్రాణాలను రక్షించలేకపోయామని ఉన్నతాధికారులు వెల్లడించారు.
జాంగిపుర్ సబ్ డివిజినల్ ఆస్పత్రిలో ప్రస్తుతం పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని.. ఈ నేపథ్యంలోనే అక్కడికి వచ్చే శిశువుల కేసులను ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీకి రెఫర్ చేస్తున్నట్లు వైద్య అధికారులు మీడియాకు వెల్లడించారు. ఈ క్రమంలోనే గత 30 రోజుల వ్యవధిలో మొత్తం 380 మంది శిశువులను మెరుగైన వైద్య చికిత్స కోసం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ముర్షిదాబాద్ మెడికల్ హాస్పిటల్‌కు పంపించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు.. ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి నివేదికను వైద్యశాఖ ఉన్నతాధికారులకు పంపినట్లు తెలుస్తోంది. ఇక అప్పుడే పుట్టిన పసిపిల్లలు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ మృతి చెందారన్న వార్తలు స్థానికంగా తీవ్ర ఆందోళనలకు కారణం అయ్యాయి. ఈ ఘటనతో ఇతర ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్న పిల్లల ఆరోగ్య పరిస్థితి పట్ల వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.