రాక్షస (వైసీపీ) పాలనను అంతం చేయడమే తెలుగుదేశం - జనసేన - బీజేపీ లక్ష్యమని కూటమి నేతలు తెలిపారు. సోమవారం నాడు ప్రజా మ్యానిఫెస్టోపై కూటమి నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్, జనసేన సీనియర్ నేత గాదె వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై కూటమి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ - జనసేన - బీజేపీ పార్టీలు కలిసింది రాక్షసుడు(జగన్)ని ఏపీ నుంచి తరిమికొట్టేందుకేనని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...రామరాజ్యం కోసం కూటమి ఏర్పడిందని చెప్పారు. కూటమికి ప్రజల్లో మద్దతు పెద్ద ఎత్తున ఉందని చెప్పారు. కూటమి మ్యానిఫెస్టో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా ఉందని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల ప్రకారం ప్రజా అభిప్రాయాలను ఈ టోల్ ఫ్రీ నెంబర్ - 8341130393లో తెలియజేయవచ్చని కోరారు. ప్రజల సూచనలు, సలహాలను గౌరవంగా స్వీకరిస్తామన్నారు. ఈ ప్రాధాన్యత అభిప్రాయాలను మ్యానిఫెస్టోలో పొందుపరుస్తామన్నారు. ఈ ఎన్నికల్లో కూటమి విజయం కోసం, రాక్షసుడి(జగన్)ని తరిమి కొట్టేందుకు ప్రజలు తమ అమూల్యమైన అభిప్రాయాలు తెలపాలని అన్నారు. రాక్షస(వైసీపీ) పాలనను అరికట్టేందుకు కూటమి చేస్తున్న మహాయజ్ఞంలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని వర్లరామయ్య పిలుపునిచ్చారు.