ఆలయాల్లో లైబ్రరీలను ఏర్పాటుచేయడం వల్ల యువతను ఆకర్షించవచ్చని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్ సోమనాథ్ అన్నారు. శనివారం తన సొంత రాష్ట్రం కేరళ తిరువనంతపురంలోని ఉదియన్నూర్ దేవి ఆలయం నుంచి సోమనాథ్ శనివారం అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాలయాలు కేవలం వృద్ధులకi దైవనామ స్మరణ ప్రదేశాలే కాకుండా సమాజాన్ని మార్చే ప్రదేశాలుగా మారాలని ఆయన ఆకాంక్షించారు. అందుకోసం దేశవ్యాప్తంగా ఆలయాల నిర్వాహకులు యువతను ఆకర్షించేందుకు కార్యాచరణ చేపట్టాలని ఇస్రో ఛైర్మన్ సూచించారు.
‘‘ఈ అవార్డు ప్రదానోత్సవ వేడుకలో ఎక్కువ మంది యువత పాల్గొంటారని ఆశించాను.. కానీ, వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది.. వారిని ఆలయాల వైపు ఆకర్షించేలా ఆలయ నిర్వాహకులు, అధికారులు కృషి చేయాలి. దేవాలయాల్లో గ్రంథాలయాలు ఎందుకు ఏర్పాటు చేయడం లేదు?.. ఇలాంటి ప్రయత్నం వల్ల చదవగలిగే యువత దేవాలయాల వైపు ఆకర్షితులవుతారు.. సాయంత్రం వేళల్లో వివిధ అంశాలపై చర్చించి కెరీర్‌ను అభివృద్ధి చేసుకునేందుకు ఇది దోహదపడుతుంది.. ఈ దిశగా ఆలయ నిర్వాహకులు కార్యచరణ చేపడితే.. మంచి మార్పులకు సహకరిస్తుంది ’’ అని ఇస్రో ఛీప్ వ్యాఖ్యానించారు.
చంద్రయాన్-3 విజయవంతమైన తరువాత సైన్స్, ఆధ్యాత్మికత మధ్య సంబంధంపై తన దృక్పథాన్ని సోమనాథ్ వెల్లడించారు. సైన్స్, నమ్మకం రెండూ వేర్వేరు అస్తిత్వాలు.. రెండింటినీ మిళితం చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. తాను సైన్స్, ఆధ్యాత్మికత రెండింటినీ అన్వేషిస్తానని కూడా నొక్కి చెప్పారు.
‘‘నేను అన్వేషకుడిని. నేను చంద్రుడ్ని అన్వేషిస్తాను.. నేను అంతరింగక విశ్వాన్ని అన్వేషిస్తాను.. కాబట్టి సైన్స్, ఆధ్యాత్మికత రెండింటినీ అన్వేషించడం నా జీవితంలో ఒక భాగం. అందుకే నేను అనేక దేవాలయాలను సందర్శిస్తాను.. అనేక గ్రంథాలను చదివాను.. కాబట్టి ఈ విశ్వంలో మన ఉనికి, ప్రయాణం అనేది అంతర్గత, బాహ్య అన్వేషణ సంస్కృతిలో ఒక భాగం.. అందుకే నేను బయట సైన్సును.. అంతర్గత అన్వేషణ కోసం దేవాలయాలకు వస్తాను’’ అని సోమనాథ్ చెప్పారు.
పుస్తకాలు చదివేందుకు ఇష్టపడే యువత ఆలయాల బాట పడతారని, వాటిని చదివి జ్ఞానాన్ని పెంచుకుని, ఉన్నతమైన జీవితానికి బాటలు వేసుకుంటారని పేర్కొన్నారు. ఇస్రో మాజీ ఛైర్మన్ జి మాధవన్ నాయర్ చేతుల మీదుగా సోమనాథ్ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కేరళ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కే జయకుమార్; స్థానిక ఎమ్మెల్యే వీకే ప్రశాంత్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.