హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యాల అంశం కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ వ్యవహారంపై దేవెగౌడ తొలిసారి స్పందించారు. నేరం రుజువై అతడిపై చర్యలు తీసుకుంటే ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అయితే, తన కుమారుడు, జెడి(ఎస్) ఎమ్మెల్యే హెచ్‌డి రేవణ్ణపై లైంగిక వేధింపులు, మహిళను కిడ్నాప్ చేసినట్టు ఆరోపణ కేసులు కల్పితమని ఆయన పేర్కొన్నారు. ఈ విషయం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున ఇంతకంటే వ్యాఖ్యానించలేనని అన్నారు. మూడు వారాల కిందట ప్రజ్వల్ వీడియోలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. శనివారం 92వ వసంతంలోకి అడుగుపెట్టిన దేవెగౌడ.. పుట్టినరోజు వేడుకల జరుపుకోవడం లేదని, తన శ్రేయాభిలాషులు, పార్టీ కార్యకర్తలు ఎవరూ ఇంటికి రావద్దని సూచించారు.
శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘హెచ్‌డీ రేవణ్ణకు సంబంధించి కోర్టులో జరుగుతున్న విషయాలపై వ్యాఖ్యానించను... ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు వెళ్లారు. దీనికి సంబంధించి, మా కుటుంబం తరపున కుమారస్వామి మాట్లాడుతూ చట్టానికి అనుగుణంగా చర్య తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత అని గౌడ చెప్పారు... ఈ లైంగిక వేధింపుల కేసులతో చాలా మంది వ్యక్తులు ఉన్నారు... నేను ఎవరి పేర్లను ప్రస్తావించదలుచుకోలేదు..ప్రమేయం ఉన్న వ్యక్తులపై చర్య తీసుకోవాలి.. బాధిత మహిళలకు న్యాయం చేయాలని కుమారస్వామి కోరారు’ అని తెలిపారు.
‘ప్రజ్వల్ రేవణ్ణపై చర్యలు తీసుకోడానికి ఎలాంటి అభ్యంతరం లేదు.. కానీ, తన కుమారుడిపై ఆరోపణలు విషయంలో ప్రజలకు వాస్తవాలు తెలియాలి.. ఇవి బోగస్ కేసులు.. ఓ కేసులో బెయిల్ వచ్చింది.. మరో కేసులో నేడో రేపో తీర్పు రానుంది.. దీనిపై నేను మాట్లాడను’ అని దేవెగౌడ ఉద్ఘాటించారు. లైంగిక దౌర్జన్యాలకు పాల్పడిన హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 27న జర్మనీకి వెళ్లిన ప్రజ్వల్.. ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడనేది తెలియరాలేదు. తిరుగు ప్రయాణానికి మూడుసార్లు టిక్కెట్ బుక్ చేసి రద్దుచేసుకున్నట్టు సిట్ గుర్తించింది.