అమరావతిలోని వెంకటపాళెంలో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం గురువారం నాడు నిర్వహించిన భూకర్షణం కార్యక్రమంలో గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు రాష్ట్రం నలుమూలల నుండి శ్రీవారి సేవకులు, భజనమండళ్ల సభ్యులు, కళాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సభావేదిక వద్ద ఉదయం 5 గంటల నుండి భజనలు, గోవిందనామాలతో మారుమోగించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులు కూడా వారితో గళం కలిపి తన్మయత్వానికి లోనయ్యారు.
ముఖ్యమంత్రి తమ ప్రసంగంలో శ్రీవారి సేవకుల సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. డాక్టర్లు తదితర వృత్తి నిపుణులతోపాటు మరింత మంది టిటిడిలో శ్రీవారి సేవకు రావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి ప్రసంగంపై శ్రీవారి సేవకులు హర్షం వ్యక్తం చేశారు. కాగా, టిటిడిలో 2000వ సంవత్సరంలో ప్రారంభమైన శ్రీవారి సేవలో ఇప్పటివరకు దేశంలోని 18 రాష్ట్రాల నుండి 10 లక్షల మందికిపైగా శ్రీవారి సేవకులు సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 6.33 లక్షల మంది, తెలంగాణ నుంచి 1.06 లక్షల మంది శ్రీవారి సేవకులు ఉన్నారు. తిరుమలలో సాధారణ రోజుల్లో ప్రతిరోజూ 1500 మంది, పర్వదినాలలో నిత్యం మూడు వేల మంది శ్రీవారి సేవకులు సేవలు అందిస్తున్నారు. శ్రీవారి ఆలయం, వైకుంఠ క్యూకాంప్లెక్స్, క్యూలైన్లు, కల్యాణకట్ట, అన్నప్రసాద భవనం, ఫుడ్ కౌంటర్లు, తిరునామధారణ తదితర విభాగాల్లో శ్రీవారి సేవకులు చక్కగా భక్తులకు సేవలందిస్తున్నారు. శ్రీవారి సేవకుల కోసం తిరుమలలో దాదాపు రూ.100 కోట్లతో నూతన భవనం త్వరలో ప్రారంభం కానుంది.
కాగా, సనాతన ధర్మ పరిరక్షణ, పరివ్యాప్తి కోసం టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ను ఏర్పాటుచేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 86,925 మంది, తెలంగాణలో 26,670 మంది ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఈ భూకర్షణం కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి 3 వేల మంది శ్రీవారిసేవకులు, దాససాహిత్య ప్రాజెక్టు నుండి 5 వేల మంది భజన మండళ్ల సభ్యులు, హిందూ ధర్మప్రచార పరిషత్ నుండి 3500 మంది భజనమండళ్ల కళాకారులు, అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.