గత 2 ఏళ్లుగా దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు పెను సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఈ కేసులో చాలా మందిని.. ఈడీ, సీబీఐలు అరెస్ట్ చేసి జైలుకు పంపించాయి. మొదట సాక్షులు, అనుమానితులుగా అదుపులోకి తీసుకున్న దర్యాప్తు సంస్థలు.. ఆ తర్వాత వారిపై అభియోగాలు మోపి నిందితులుగా పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ కేసులో సుదీర్ఘంగా దర్యాప్తు చేస్తున్న ఈడీ, సీబీఐలు.. ఇప్పటికే కోర్టుల్లో ఛార్జిషీట్లు దాఖలు చేశాయి. అయితే కొన్ని రోజులుగా ఈ కేసులో నిందితులుగా ఉన్న వారికి బెయిల్ మంజూరు అవుతున్నాయి. నెలలు, ఏళ్ల తరబడి జైలులో ఉన్న వారంతా ప్రస్తుతం బెయిల్‌పై బయటికి వస్తున్నారు. దీంతో అసలు ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో సుదీర్ఘ విచారణ చేసిన ఈడీ, సీబీఐ అధికారులు.. నిందితులపై మోపిన అభియోగాలను కోర్టుల్లో రుజువు చేయడంలో విఫలం అయ్యారు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మద్యం పాలసీ కేసులో చేస్తున్న ఆరోపణలకు.. దర్యాప్తు సంస్థలు చూపించిన ఆధారాలకు పొంతన లేకపోవడంతో.. నిందితులకు కోర్టులు బెయిల్ మంజూరు చేస్తున్నాయి.
ఢిల్లీ లిక్కర్ కేసులో పెద్ద నేతల అరెస్ట్
ఈ ఢిల్లీ లిక్కర్ కేసు మొత్తం ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ చుట్టు తిరిగింది. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు సహా ఏకంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొని కొన్ని నెలల పాటు జైలులో ఉన్నారు. తాజాగా ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలు.. నిందితులపై అనేక కేసులు నమోదు చేశాయి. అంతేకాకుండా ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక సూత్రధారులు, ప్రధాన నిందితులు అని తీవ్ర ఆరోపణలు కూడా చేశాయి. ఆప్ మాత్రమే కాకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, గతంలో వైసీపీలో ఉండి ప్రస్తుతం టీడీపీలో చేరిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ సహా పలువురు వ్యాపారవేత్తలు, ఆప్ నేతల సహాయకులు కూడా ఈ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు.
ఎవరెవరు అరెస్ట్ అయ్యారు?
ఇక ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌ను 2022 మే నెలలో ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మొట్టమొదటగా ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత 2023 ఫిబ్రవరి 26వ తేదీన మనీష్ సిసోడియాను సీబీఐ మొదట అరెస్ట్ చేయగా.. ఆ తర్వాత అదే ఏడాది మార్చి 9వ తేదీన సీబీఐ కస్టడీలో ఉండగానే ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత 2023 అక్టోబర్ 4వ తేదీన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇక సెప్టెంబర్ 2022లో ఆప్ కమ్యూనికేషన్ ఇంఛార్జ్ విజయ్ నాయర్‌ను సీబీఐ అరెస్ట్ చేయగా.. నవంబర్‌లో ఈడీ అరెస్ట్ చేసింది. ఇక ఈ ఏడాది మార్చి 15వ తేదీన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. వీళ్లే కాకుండా ఇంకా మద్యం వ్యాపారులు, ఇతర పార్టీల నేతలు సహా చాలా మంది అరెస్ట్ అయ్యారు. అయితే వీళ్లంతా ప్రస్తుతం ఒక్కొక్కరుగా బెయిల్‌పై జైలు నుంచి బయటికి వచ్చారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసుతో రాజకీయ దుమారం
ఇక ఈ ఢిల్లీ మద్యం పాలసీ కేసు.. ప్రధానంగా బీజేపీ, ఆప్‌ల మధ్య తీవ్ర రాజకీయ దుమారానికి కారణం అయింది. గత 2 ఏళ్లుగా ఈ కేసుకు సంబంధించి బీజేపీ, ఆప్ తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ మధ్య కూడా ఈ అంశమే మాటల యుద్ధానికి దారి తీసింది. దీంతో దాదాపు 2 ఏళ్లుగా ఈ ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీబీఐ, ఈడీ అధికారుల విచారణ, దర్యాప్తు, అరెస్ట్‌లు, సాక్ష్యాల సేకరణ ఏమైంది అనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. మద్యం వ్యాపారులతో కలిసి ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న వ్యక్తులు.. భారీగా అవినీతికి తెరతీశారని ఈడీ, సీబీఐ అధికారులు పదే పదే కోర్టుల్లో వాదించారు. వారు అవినీతికి పాల్పడ్డారని చెప్పేందుకు అన్ని ఆధారాలు ఉన్నాయని.. కోర్టులకు తెలిపారు. కానీ వాటిని రుజువు చేయడంలో దర్యాప్తు సంస్థలు విఫలం కావడంతోనే ఇప్పుడు ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న వారంతా బెయిల్‌పై జైలు నుంచి విడుదలై బయటికి వస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
అసలేంటీ ఢిల్లీ మద్యం పాలసీ
2021-2022 ఏడాదికి సంబంధించి ఢిల్లీలో అధికారంలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం.. కొత్త మద్యం పాలసీ విధానాన్ని రూపొందించింది. ఈ విధానం ప్రకారం ప్రభుత్వ హయాంలో ఉన్న లిక్కర్ అమ్మకాలను ప్రైవేటు కంపెనీలకు అప్పగిస్తున్నట్లు తెలిపింది. అప్పటివరకు ఢిల్లీలో 60 శాతం మద్యం షాపులు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండగా.. 40 శాతం మాత్రమే ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేవారు. కానీ కొత్త పాలసీ ప్రకారం మొత్తం మద్యం షాపులను పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. మొత్తం ఢిల్లీని 32 జోన్లుగా విభజించి మద్యం షాపులు పెట్టేందుకు అనుమతించారు.
కొత్త మద్యం పాలసీలోని అంశాలు
ఎమ్మార్పీ ధరకు కాకుండా.. మద్యం వ్యాపారులకు నచ్చిన ధరకు లిక్కర్‌ను అమ్ముకునే అవకాశం కల్పించారు. తెల్లవారుజామున 3 గంటల వరకు మద్యం షాపులు తెరిచి ఉంచవచ్చని పేర్కొన్నారు. మద్యం షాపులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం వల్ల ప్రభుత్వ ఆదాయం రూ.9,500 కోట్లు పెరుగుతుందని ఢిల్లీ ప్రభుత్వం అంచనా వేసింది. ఈ కొత్త పాలసీ ప్రకారం టెండర్లు వేసి మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ అప్పగించింది. ఇందుకోసం మద్యం వ్యాపారుల నుంచి ఢిల్లీ ప్రభుత్వం భారీగా లైసెన్స్ ఫీజులు వసూలు చేసింది. ఆ కొత్త మద్యం పాలసీ కంటే ముందు లైసెన్స్ కోసం రూ. 25 లక్షలు చెల్లించేవారు కాగా.. ఆ విధానం వచ్చిన తర్వాత ఎల్1 లైసెన్స్ కోసం దాన్ని ఏకంగా రూ. 5 కోట్లకు పెంచారనే వార్తలు వెలుగులోకి వచ్చాయి.