ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నానికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సాగర తీర నగరాన్ని కలుపుతూ విజయనగరం, నెల్లిమర్ల, భోగాపురం, అనకాపల్లి పట్టణాలకు ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. రెండు రోజుల క్రితం నగరంలో పర్యటించిన సీఎం.. హైదరాబాద్ మాదిరిగా విశాఖను అభివృద్ధి చేయాలని కొన్ని సూచనలు చేశారు. విశాఖపట్నంతో పాటుగా అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలపై సమీక్షలో కీలక వ్యాఖ్యలు చేశారు.. అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డుతో పాటుగా విశాఖపట్నంలో పర్యాటక రంగం అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
నగరానికి ఎక్కడి నుంచైనా పర్యాటకులు వస్తే వారం రోజులు ఇక్కడే ఉండేలా మంచి ప్రాజెక్టులు రూపొందించాలని అధికారుల్ని ఆదేశించారు చంద్రబాబు. ఈ మేరకు అభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టుల కోసం దేశ, విదేశాల్లో అధ్యయనం జరగాలన్నారు. నగరంలో చిన్నపిల్లలు వచ్చి ఆడుకునేలా పార్కులను తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. విశాఖపట్నంలో డ్రైనేజీ వ్యవస్థ పక్కాగా ఉండాలని.. లిక్విడ్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అంతేకాదు అరకు కాఫీ, మిరియాలు, పసుపులకు మరింత బ్రాండింగ్, మార్కెటింగ్ చేయాలని సూచనలు చేశారు.
విశాఖపట్నానికి గోదావరి నీటిని తీసుకురావడం ద్వారా నగర తాగునీటి కష్టాలు తీరతాయన్నారు ముఖ్యమంత్రి. కేంద్రం తీసుకొచ్చిన సూర్యఘర్ పథకంలో భాగంగా ప్రతి ఇంట్లో 200 యూనిట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి జరగాలి అననారు. టాటా, జీఎంఆర్ సంస్థలను మెంటార్లుగా తీసుకోవాలని.. యువత ఉద్యోగాలు సాధించే విధంగా నైపుణ్య శిక్షణ ఇవ్వాలన్నారు. లాజిస్టిక్స్ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని.. పోర్టుల అనుసంధానం చేయాలని సూచించారు. 2026లో భోగాపురం విమానాశ్రయం పూర్తవుతుందని.. అప్పటికి అన్ని అభివృద్ధి ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చేలా ప్లాన్ చేసుకోవాలన్నారు.
విశాఖపట్నంలో చేపట్టే అభివృద్ధి పనులకు ప్రజా ప్రతినిధులు సహకారం అందించాలని సూచించారు చంద్రబాబు. సింహాచలం పంచ గ్రామాల సమస్య ఎంతో కాలంగా పరిష్కారం కాకుండా పెండింగ్ ఉండిపోయిందని.. దేవస్థానానికి ప్రత్యామ్నాయ భూములు చూడాలని ఆదేశించారు. అనకాపల్లి-అచ్యుతాపురం రోడ్డు గురించి ప్రస్తావన రాగా.. పరవాడ నుంచి కొండకర్ల ఆవ మీదుగా ఏపీఐఐసీ సెజ్‌కు గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు వేసుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.. దీంతో పీపీపీలో చేయగలిగితే ముందుకు వెళ్లాలని చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలో అన్న క్యాంటీన్ల దగ్గర రద్దీ ఎక్కువగా ఉంటుందని అధికారులు ప్రస్తావించగా.. తగిన ఏర్పాట్లు చేసి రద్దీని తగ్గించాలని సూచించారు. అలాగే నగరంలో సంక్రాంతి తర్వాత ఎక్కడైనా రోడ్లపై గుంతలు కనిపించినా, ఫిర్యాదు వచ్చినా ఊరుకునేది లేదని.. సంబంధిత అధికారిని సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు.
విశాఖపట్నంలో సీసీ టీవీ కెమెరాల సంఖ్య ఇంకా పెంచాలని పోలీస్ కమిషనర్‌కు చంద్రబాబు సూచించారు. అలాగే వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించాలన్నారు. తనకు విశాఖపట్నం అంటే ప్రత్యేక అభిమానం అని.. ఈ నగరానికి మంచి భవిష్యత్తు ఉందన్నారు. విశాఖ ప్రజలకు విజ్ఞత ఎక్కువని.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అది మరింత స్పష్టమైంది అన్నారు. ఇక్కడి ప్రజలు నీతి, నిజాయితీగా ఉంటారని వ్యాఖ్యానించారు చంద్రబాబు. అందుకే ఈ ప్రాంత అభివృద్ధికి మరింతగా ప్రాధాన్యం ఇస్తామన్నారు.