ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్రాకర్స్ బ్యాన్‌పై తీసుకున్న చర్యలేంటి? ఢిల్లీ సర్కారు, పోలీస్ బాస్‌కు సుప్రీంకోర్టు అంక్షింతలు

national |  Suryaa Desk  | Published : Mon, Nov 04, 2024, 10:17 PM

దీపావళి పండుగ తర్వాత దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కాలుష్యం పెరగడంపై సర్వోన్నత న్యాయస్తానం తీవ్రంగా స్పందించింది. టపాసుల కాల్చడంపై ఉన్న నిషేధం అమలుకావడం లేదని మండిపడింది. బాణాసంచా నిషేధాన్ని అమలు చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ నివేదికను సమర్పించాలని ఢిల్లీ ప్రభుత్వం, పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది. అలాగే వచ్చే ఏడాది నిషేధం అమలు కోసం ప్రతిపాదిత చర్యలు అఫిడ్‌విట్‌లో పొందుపరచాలని పేర్కొంటూ ఈ మేరకు నోటీసులు జారీచేసింది.


 ‘బాణాసంచా కాల్చడంపై నిషేధం అమలు చేయలేదని వార్తలు వస్తున్నాయి.. కాలుష్య నియంత్రణకు ఇదొక ముఖ్యమైన చర్యగా భావించాం. టపాసుల అమ్మకాలు, తయారీ, వాటిని కాల్చడంపై ఉన్న నిషేధానికి సంబంధించి ఇచ్చిన ఆదేశాల వివరాలు అఫిడవిట్‌లో పొందుపరచండి.. నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు, కోర్టు ఆదేశాలు అమలు చేయడానికి తీసుకున్న చర్యల వివరాలను ఢిల్లీ పోలీసులు కోర్టుకు సమర్పించాలి’ అని స్పష్టం చేసింది. వారం రోజుల్లోగా తమకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. నిషేధాన్ని ఉల్లంఘించే వారి స్థలాలను సీల్‌ చేయడం వంటి కఠిన చర్యలు అవసరమని, 2025 నాటి దీపావళికైనా ఇలాంటి పరిస్థితి ఉత్పన్నంకాకుండా చర్యలు ఉండాలని సూచించింది.


ఈ సందర్భంగా సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ నివేదికను ప్రస్తావించింది. గత రెండేళ్ల కిందటితో పోలిస్తే.. 2024 దీపావళికి వాతావరణంలో వేడి శాతం ఎక్కువగా ఉందని పేర్కొంది. పంట వ్యర్థాలను తగులబెట్టే ఘటనలపై పంజాబ్‌, హర్యానా ప్రభుత్వాలు తమ సమాధానాలను నవంబర్ 14లోగా కోర్టు ముందు ఉంచాలని అల్టిమేటం జారీచేసింది.


దీపావళి మర్నాడు నుంచి ఢిల్లీలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయి మించి తగ్గిపోయింది. ఆ రోజు రాత్రి నుంచి క్రమంగా కాలుష్యం పెరుగుతూ ఉంది. గురువారం రాత్రి ఏకంగా 600కిపైగా పాయింట్లకు చేరడం గమనార్హం. సోమవారం ఉదయం వాయునాణ్యత ఆనంద్ విహార్, రోహిణి, అశోక్ విహార్, వివేక్ విహార్ సహా పలు ప్రాంతాల్లో 400 మార్క్‌కు చేరువలో నమోదయ్యింది. కాలుష్యం తక్కువగా ఉండే లోడి రోడ్డులోనూ పరిస్థితి తీవ్రంగా ఉంది. ఆదివారంతో పోల్చితే సోమవారం మరింత అధ్వాన్నంగా ఉంది. నొయిడా, ఘాజియాబాద్, గురుగ్రామ్, హర్యానాలోని హిస్సార్, రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్, భరత్‌పూర్‌లోనూ వాయు నాణ్యత 350కిపైగా నమోదయ్యింది. టపాసుల కాల్చడంపై సుప్రీంకోర్టు, ప్రభుత్వం, పొల్యూషన్ బోర్డు నిషేధం విధించినా.. ప్రజలు మాత్రం వాటిని ఏ మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. యధేచ్చగా బాణాసంచా కాల్చి నిషేధం ఉల్లంఘనకు పాల్పడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com