కేరళలోని శబరిమలలో కొలువైన అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు ఏటా లక్షలాది మంది భక్తులు తరలివెళ్తూ ఉంటారు. అయితే శబరిమల అయ్యప్పను దర్శించుకోవడానికి వెళ్లే మార్గం చాలా కష్టతరంగా ఉంటుంది. ఇక ప్రతీ సంవత్సరం శబరిమలలో జరిగే మండల-మకరవిళక్కు పూజల కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా అయ్యప్ప భక్తులు శబరిగిరులకు తరలివెళ్తూ ఉంటారు. అయితే దూర ప్రాంతాల నుంచి వచ్చే అయ్యప్ప భక్తుల కోసం శబరిమలలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మించాలనే ప్రతిపాదన ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నా అది ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు. తాజాగా శబరిమల గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి కొట్టాయం జిల్లా అధికారులు.. ఒక నివేదిక తయారు చేశారు. ఎయిర్‌పోర్టు నిర్మించాలంటే భూసేకరణ, అక్కడి నుంచి తరలించాల్సిన వాటి గురించి ఆ రిపోర్టులో పూర్తిగా చేర్చారు.
కొట్టాయం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టును ఏర్పాటు చేసేందుకు 3.4 లక్షల చెట్లను నరికివేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇందులో 3.3 లక్షల రబ్బరు, 2492 టేకు, 1131 పనస చెట్లు, 828 మహోగని, 184 మామిడి చెట్లను తొలగించాలని పేర్కొన్నారు. అంతే కాకుండా 352 కుటుంబాలను అక్కడి నుంచి తరలించి వారికి పునరావాసం కల్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఆ ప్రాంతంలో ఉండే సెయింట్ థామస్ ఎక్యుమెనికల్ చర్చి, హిదాయుతుల్ ఇస్లాం జుమా మసీదు, శ్రీ అమ్మన్ కోవిల్, శ్రీ పూవన్‌పలమల దేవాలయం, సెయింట్ గ్రెగోరియో చర్చి, సెయింట్ జోసెఫ్ చర్చి కరీమ్‌హోట్, పంచతీర్థ పరాశక్తి దేవస్థానాలను కూడా మరో చోటుకు మార్చాల్సి ఉంటుందని వివరించారు. ఇక ఆ ప్రాంతంలో ఉన్న ఒక స్కూల్, 5 వ్యాపార సంస్థలను అక్కడి నుంచి తరలించాల్సిందేనని తెలిపారు.
ఇక ఈ శబరిమల గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ప్రాజెక్ట్ కారణంగా నేరుగా 347 కుటుంబాలు జీవనోపాధిని కోల్పోతాయని ఆ నివేదిక తెలిపింది. చెరువల్లి ఎస్టేట్‌కు సంబంధించి పనులు చేస్తున్న 238 కుటుంబాలు తమ నివాసాలను, జీవనోపాధిని కోల్పోతాయని.. ఇక్కడ నివసించే దేశవాళీ జాతి ఆవు చెరువల్లి ఆవులను కూడా ఈ ప్రాంతం నుంచి తరలించాల్సి ఉంటుందని పేర్కొంది. ఇది ఆవుల పర్యావరణ వ్యవస్థను ప్రభావితం చేస్తాయని ఆ నివేదికలో కొట్టాయం జిల్లా యంత్రాంగం వెల్లడించింది. ఈ దేశవాళీ ఆవుల పెంపకమే స్థానికులకు ఆదాయ వనరు అని వెల్లడించింది.
ఇక ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు కోసం మణిమాల, ఎరుమేలి సౌత్ గ్రామాల నుంచి 1039.876 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుంది. శబరిమల యాత్రికులు, ఎన్నారైలు, పర్యాటకులు, ఇతర ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతిపాదిత శబరిమల గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రూపొందించినట్లు ప్రాజెక్ట్ ప్రమోటర్ కేఎస్ఐడీసీ తెలిపింది. అయితే శబరిమలలో ఎయిర్‌పోర్టు నిర్మిస్తే.. ఆ ప్రాంతంలో పర్యాటక రంగం అభివృద్ధి చెంది ఖజానాకు ఆదాయం వస్తుందని అధికారులు పేర్కొన్నారు. వవారు చర్చి, మారమన్ కన్వెన్షన్, ఏటుమనూరు మహాదేవ దేవాలయం వంటి తీర్థయాత్రలకు రవాణా సదుపాయాలు మెరుగుపడతాయని తెలిపారు. కుమరకం బ్యాక్ వాటర్, మున్నార్ హిల్ స్టేషన్లు, గవి, తేక్కడి వన్యప్రాణుల అభయారణ్యం, పెరియార్ టైగర్ రిజర్వ్, ఇడుక్కి డ్యామ్ వంటి ప్రధాన పర్యాటక రంగాలను ఇది కలుపుతుందని పేర్కొన్నారు. పార్లమెంట్‌కు సమర్పించిన నివేదిక ప్రకారం.. శబరిమల గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మిస్తే స్థానిక ఆర్థిక వ్యవస్థ, పర్యాటక రంగానికి ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లు అవుతుందని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa