‘పద్మ’ పురస్కారాలకు ఎంపికైన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, కళాకారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. వైద్యరంగంలో అందించిన సేవలకు గాను పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్న గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఏఐజీ హాస్పటల్స్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీ దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి, అలాగే పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన నటులు, ఎమ్మెల్యే, బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ ద్వారా సామాజిక సేవారంగంలో ఉన్న నందమూరి బాలకృష్ణ, పద్మశ్రీకి ఎంపికైన సహస్రావధాని శ్రీ మాడుగుల నాగఫణి శర్మ, దళిత నాయకుడు, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ, ఇంకా విద్య, సాహిత్య రంగంలో ఎనలేని కృషి చేసి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన కెఎల్ కృష్ణకి, వాదిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖి తదితరులకు శుభాకాంక్షలు తెలిపారు. తమ నటన, అభినయంతో కోట్లాది ప్రేక్షకుల మనసులు గెలిచిన కళామతల్లి ముద్దుబిడ్డలు పద్మభూషణ్‌కు ఎంపికైన ఎస్ అజిత్ కుమార్, శోభన చంద్రకుమార్‌లకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు చెప్పారు. బుర్రకథ కళాకారులు, జానపద కళాకారులను ఎందరినో తెలుగునేలకు అందించిన స్వర్గీయ మిరియాల అప్పారావు మరణానంతరం పద్మశ్రీ పురస్కారం లభించడాన్ని వారి సేవలకు దక్కిన గౌరవంగా ముఖ్యమంత్రి కొనియాడారు.