ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రైవేటు పాఠశాలల గుర్తింపు గడువును పదేళ్లకు పెంచాలని కోరారు. క్యాంపస్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావడంతో పాటు ఫైర్ సర్టిఫికెట్, స్ట్రక్చరల్ ఎన్వోసీ, శానిటేషన్ సర్టిఫికెట్ మంజూరును సులభతరం చేయాలని సూచించారు. ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్లకు గుర్తింపు ఇవ్వాలని కోరారు. ప్రీ ప్రైమరీ పాఠశాలలకు గుర్తింపు ఇవ్వడంతో పాటు అర్హత లేని ఉపాధ్యాయులకు డీఎల్ఈడీ చేయడానికి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా సమయంలో రెండేళ్ల పాటు ప్రైవేటు స్కూల్ బస్సులు నిరుపయోగంగా ఉన్నాయని, వాటి కాలపరిమితి రెండేళ్లు పెంచాలని కోరారు. రాష్ట్రంలో తెలుగు మీడియం ప్రైవేటు పాఠశాలలు 150 వరకు ఉన్నాయని, వాటిని ఇంగ్లీషు మీడియంగా కన్వర్షన్ చేయాలని అభ్యర్థించారు."బడ్జెట్ స్కూల్స్ కు రుణ సదుపాయం కల్పించాలి. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు కూడా ప్రతిభా పురస్కారాలు అందజేయాలి. ప్రైవేటు స్కూల్స్ ను కేటగిరైజ్ చేసే అంశాలన్ని పరిశీలించాలని సూచించారు. ప్రేవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కూడా శిక్షణ తరగతులు నిర్వహించడంతో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయులతో కలిసి క్రీడల్లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలి. పదో తరగతిలో తిరిగి గ్రేడింగ్ సిస్టమ్ ను తీసుకురావాలి. ఓపెన్ స్కూల్స్ కు కూడా గుర్తింపు గడువును పదేళ్లకు పెంచాలి. ముంపు మండలాల్లో ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి. ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి. స్కూల్ బస్సుల విషయంలో పన్నుల భారాన్ని తగ్గించాలి" అని కోరారు. ఆయా అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేశ్ భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పరుచూరి అశోక్ బాబు, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, వేపాడ చిరంజీవితో పాటు వివిధ ప్రైవేటు స్కూల్స్ అసిసోయేషన్ ప్రతినిధులు, పాఠశాలల నిర్వాహకులు పాల్గొన్నారు.