పంజాబ్ కాంగ్రెస్ పార్టీకి ఇపుడు కొత్త నాయకుడు ఎవరు అన్న చర్చ ప్రారంభమైంది. కారణం పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పదవికి నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవి చూడడం తెలిసిందే. అందులో పంజాబ్ కూడా ఒకటి. దీంతో పార్టీని సంస్కరించే కార్యక్రమాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా చేపట్టారు. ఇటీవలి సీడబ్ల్యూసీ సమావేశంలో అధ్యక్ష బాధ్యతలను సోనియానే నిర్వహించాలంటూ తీర్మానించడం తెలిసిందే. అందుకు ఆమె అంగీకరించారు. ఆ వెంటనే ఐదు రాష్ట్రాల్లోని పీసీసీ చీఫ్ ల రాజీనామాకు ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికలు ముగిసిన ఐదు రాష్ట్రాల్లోనూ పార్టీ రాష్ట్ర శాఖలను పునర్వ్యవస్థీకరించాలంటూ ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అధ్యక్షురాలి ఆదేశంతో సిద్ధూ రాజీనామా చేశారు. ఈ లేఖను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. పంజాబ్ పీసీసీ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు పార్టీ అధ్యక్షురాలిని ఉద్దేశించి రాసిన లేఖలో పేర్కొన్నారు. నిజానికి పంజాబ్ లో కాంగ్రెస్ అధికారం నిలబెట్టుకోకపోవడం వెనుక అంతర్గత కుమ్ములాటలే కారణమని తెలుస్తోంది. సీఎం అమరీందర్ తో సిద్ధూకు పొసగలేదు. రాహుల్, ప్రియాంకకు సన్నిహితుడైన సిద్ధూ అమరీందర్ ను సీఎం పదవి నుంచి తప్పించడంలో సఫలీకృతులయ్యారు. దాంతో అమరీందర్ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన చన్నీతోనూ సిద్ధూ సఖ్యత లేకుండా వ్యవహరించారు. ఇవన్నీ కలసి చేదు అనుభవాలను చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.