రష్యా విషయంలో భారత వైఖరిని అమెరికా నేరుగా తప్పుపట్టకపోయినా భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు మాత్రం తపుపట్టాడు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేసే అంశంలో అమెరికా ఆచితూచి స్పందించింది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం.. రష్యాపై అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలను ఉల్లంఘించడం కాదని అమెరికా అధ్యక్ష కార్యాలయం మీడియా సెక్రటరీ జెన్ సాకీ స్పష్టం చేశారు. భారత్, రష్యా నుంచి చౌక ధరకు చమురును దిగుమతి చేసుకోనుందన్న వార్తలను ప్రస్తావించిన సందర్భంలో జెన్ సాకీ స్పందించారు. ‘‘మేము విధించిన ఆంక్షలకు కట్టుబడి ఉండాలన్నదే ప్రతి దేశానికి మేము ఇచ్చే సందేశం. కానీ చరిత్రలో ప్రస్తుత సందర్భంలో మీరు ఏ వైపున ఉండాలన్నది నిర్ణయించుకోండి. రష్యా నాయకత్వానికి మద్దతు పలకడం అంటే దురాక్రమణకు మద్దతుగా నిలవడమే. అది వినాశకర ప్రభావం చూపుతుంది’’ అని జెన్ సాకీ పేర్కొన్నారు. కానీ, ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణను భారత్ సమర్థించలేదు. అలా అని వ్యతిరేకించనూ లేదు. తటస్థంగా ఉండిపోవడం తెలిసిందే. తాజా పరిణామం పట్ల భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు అమి బేరా అసంతృప్తి వ్యక్తం చేశారు. "వస్తున్న కథనాలు నిజమైతే, మార్కెట్ ధర కంటే భారత్ రష్యా చమురును కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంటే.. అప్పుడు పుతిన్ వైపు భారత్ నిలిచినట్టు అర్థం చేసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ ఐకమత్యంగా ఉక్రెయిన్ ప్రజలకు మద్దతుగా నిలుస్తున్న తరుణంలో భారత్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటోంది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, క్వాడ్ మెంబర్ గా భారత్ బాధ్యతగా వ్యవహరించాలి’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.