మహబూబాబాద్ జిల్లా కేంద్రం సిగ్నల్ తండాలో ఘోరం జరిగింది. అత్త, మామ, భర్త, ఆడపడుచు కలిసి కోడలిని హతమార్చి ఇంట్లోనే పాతిపెట్టారు. ఆ తర్వాత ఆమెను పాతిపెట్టిన ప్రాంతంలోనే సంక్రాంతి పిండి వంటలు చేసుకున్నారు. భూపతి అంజయ్య ఇంట్లో గత కొన్ని నెలలుగా కాటి గోపి అతని భార్య నాగమణి, తల్లిదండ్రులు లక్ష్మి, రాములు, ఆడపడుచు దుర్గ, బావ మహేందర్ అద్దెకు ఉంటున్నారు. కాటి గోపి-నాగమణి దంపతులకు ఇద్దరు కుమారులు. కొన్ని నెలలుగా నాగమణిని భర్త గోపి వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే వాళ్లంతా కలిసి నాగమణిని ఈనెల 13వ తేదీన హత్య చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఓనర్ అంజయ్య ఇంటికి చేరుకోగా అక్కడ గొయ్యి తీసిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. క్లూస్ టీం తనిఖీలు చేసింది. దీంతో నాగమణిని హత్య చేసి ఇంటి పక్కనే పూడ్చినట్లు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.