బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌పై గురువారం రోజు వేకువజామున 2.30 గంటలకు దాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కోటి రూపాయలు డిమాండ్ చేస్తూ నిందితుడు హీరోపై ఆరు సార్లు కత్తితో దాడి చేశాడు. ఈక్రమలంనే సైఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర రక్తస్రావం అవుతుండగానే.. ఆస్పత్రికి వెళ్లాడు. అయితే ఆయన కుమారుడు ఇబ్రహీం అలీఖాన్‌యే అతడిని ఆటోలో ఆస్పత్రికి చేర్పించినట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ అదంతా తప్పు అని.. సైఫ్‌తో ఆస్పత్రికి వచ్చింది అతడు కాదని లీలావతి ఆస్పత్రి వైద్యుడు తెలిపారు. ముఖ్యంగా సైఫ్‌తో ఆటోలో వచ్చింది ఓ ఏడేళ్ల బాలుడు అని చెప్పారు. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కత్తితో తనపై దాడి జరిగిన తర్వాత సైఫ్ అలీఖాన్.. ఒక ఆటోలో లీలావతి ఆస్పత్రికి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, సైఫ్‌ను లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణా.. తాజాగా మీడియాతో మాట్లాడారు. ఆ రాత్రి ఏం జరిగిందో చెప్పారు. రాత్రి 2 నుంచి 3 గంటల సమేయంలో ఒక మహిళ రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఆపే ప్రయత్నం చేసిందని.. అయితే, ఎవరూ తమ వాహనాలను ఆపలేదని భజన్ సింగ్ చెప్పారు. అప్పుడే.. ఆటో ఆపండి అంటూ గేట్ లోపల నుంచి వచ్చిన మాటలను తాను విన్నానని వెల్లడించారు.
దీంతో వెంటనే తాను యూటర్న్ తీసుకుని వచ్చి గేటు వద్ద ఆటోను ఆపానని తెలిపారు. ఆ సమయంలో లోపలి నుంచి ఒక వ్యక్తి గాయాలతో, రక్తపు మరకలతో రావడం గమనించాన్నారు. అతడితో పాటు మరో నలుగురు వ్యక్తులు కూడా ఉన్నారని.. అయితే అందులో ఓ పిల్లాడు మాత్రమే ఆటోలోకి ఎక్కి లీలావతి హాస్పిటల్‌కి తీసుకెళ్లాలని కోరినట్టు భజన్ సింగ్ వెల్లడించారు. వారు కోరినట్టే తాను లీలావతి హాస్పిటల్ వద్ద డ్రాప్ చేశానని.. అప్పుడే తనకు గాయాలతో ఉన్న వ్యక్తి సైఫ్ అలీఖాన్ అని తెలిసిందని చెప్పారు. సైఫ్ మెడతో పాటు వీపు భాగం నుంచి రక్తం రావడం చూశానని భజన్ సింగ్ వివరించారు.
ఆటోలో వెళ్తున్న సమయంలో సైఫ్ రెండు, మూడు సార్లు.. లీలావతి ఆసుపత్రికి చేరుకోవడానికి ఇంకా ఎంత సమయం పడుతుందని అడిగినట్టు ఆటో డ్రైవర్ చెప్పారు. అప్పటికి ఆటోలో ఉన్నది సైఫ్ అనే విషయం తనకు తెలియదని కూడా వివరించారు. అయితే ఆస్పత్రి వద్దకు వెళ్లగానే.. సైఫ్ అలీఖాన్ తన ఏడేళ్ల చిన్న కుమారుడు అయిన తైమూర్ అలీఖాన్ చేయి పట్టుకుని లోపలకు నడుచుకుంటూ వచ్చినట్లు లీలావతి ఆస్పత్రి వైద్యుడు వెల్లడించారు. అందరూ అతడిని ఇబ్రహీం అనుకున్నారు కానీ అది తప్పని.. తైమూర్ అలీఖాన్‌యే తండ్రితో ఆస్పత్రికి వచ్చినట్లు వివరించారు.