ఓ రేపిస్ట్ ఎన్ కౌంటర్ కు గురయ్యాడు. ఓ అమ్మాయిపై అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ యువకుడు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు. దీనిపై పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు తెలిపారు. అసోంలోని గువాహటికి చెందిన బికి అలీ అనే యువకుడు తన నలుగురు స్నేహితులతో కలిసి గరియాన్‌లోని ఓ హోటల్‌లో ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం నిందితులు అందరూ పారిపోయారు. దీంతో ఆ బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. పాన్ బజార్ మహిళా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆ వెంటనే ప్రధాన నిందితుడు బికి అలీని గుర్తించి నిన్న అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన నలుగురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సమయంలో గత రాత్రి బికి అలీ పోలీసుల కస్టడీ నుంచి పారిపోయేందుకు యత్నించాడని, పోలీస్ స్టేషన్ లో అలీని ఆపే ప్రయత్నంలో పోలీసులు విఫలమయ్యారని అధికారులు తెలిపారు. అంతేగాక, మహిళా పోలీసులపై అలీ దాడికి దిగాడని వివరించారు. అతడు మరింత రెచ్చిపోవడంతో ఆత్మరక్షణ కోసం అతడిపై పోలీసులు కాల్పులు జరిపారని తెలిపారు. దీంతో నిందితుడు మృతి చెందాడని చెప్పారు. అతడి దాడిలో ఇద్దరు మహిళా పోలీసులు గాయపడ్డారు. ఈ ఎన్‌కౌంటర్ అసోం వ్యాప్తంగా సంచలనంగా మారింది.