గ్రామంలో జరిగిన అక్రమాలపై విచారణ జరుగుతున్న సమయంలోనే వైసీపీ వర్గీయులు యన్నం రమణారెడ్డి అనే సామాజిక కార్యకర్తపై దాడిచేసిన ఘటన మండలంలోని చందవరం గ్రామంలో బుధవారం జరిగింది. దాడిలో స్పృహతప్పి పడిపోయిన బాధితుడు రమణారెడ్డిని చికిత్స నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి 108 వాహనంలో తరలించారు.
ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో చందవరం గ్రామంలో నిర్మించిన సిమెంటు రోడ్లు నాణ్యత లేకపోవడంతో పగుళ్లిచ్చాయి. అనధికారికంగా పంచాయతీలో నీటి కనెక్షన్లు ఇచ్చి అక్రమాలకు పాల్పడ్డారని అదే గ్రామానికి చెందిన రమణారెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశాడు. అదేవిధంగా పంచాయతీలో తీర్మానాలు చేయకుండానే ప్రైవేటు రోడ్లను సిమెంటు రోడ్లుగా మార్చి నిధులు దుర్వినియోగం చేశారని స్పందన కార్యక్రమంలో అధికారులకు ఫిర్యాదుచేశాడు.
అతను చేసిన ఫిర్యాదుపై అధికారులు స్పందించకపోవడంతో తన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ సమాచార హక్కుచట్టం ద్వారా ఉన్నతాధికారులను సంప్రదించాడు. ఈ విషయమై ఏ చర్యలు తీసుకున్నారో తెలియజేయాలంటూ ఉన్నతాధికారుల నుంచి ఎంపీడీవో తదితరులకు ఆదేశాలు వచ్చాయి.
అంతేకాకుండా గ్రామం లోని పలు విషయాలపై లోకాయుక్తకు కూడా ఫిర్యాదుచేశాడు. దీంతో సచివాలయంలో బుధవారం ఎంపీడీవో మోషే, ఏఈలు రమణారెడ్డి, సూర్యతేజ, కార్యదర్శులు కాంతారావు, జరీనాలు విచారణ జరిపేందుకు హాజరయ్యారు. రమణారెడ్డిని విచారిస్తున్న సమయంలోనే కొందరు వైసీపీ వర్గీయులు కార్యాలయం గదిలోనికి వచ్చారు. తనను విచారిస్తూ వారిని ఎందుకు పిలిచారంటూ ఎంపీడీవో మోషేను రమణారెడ్డి ప్రశ్నించాడు.
ఈ సందర్భంగా విచారణ సక్రమంగా జరగడంలేదంటూ అసహనం వ్యక్తంచేశారు. దీంతో రమణారెడ్డికి, వైసీపీ వర్గీయులకు మధ్య వాగ్వాదం జరిగింది. మూకుమ్మడిగా వైసీపీ వర్గీయులు రమణారెడ్డిని రోడ్డుపైకి లాక్కెళ్లి ఇష్టానుసారంగా దాడిచేశారు. స్పృహతప్పి పడిపోవడంతో 108 వాహనంలో రమణారెడ్డిని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.