రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అవినీతి, అరాచకాలతో రోజు రోజుకి పెట్రేగిపోతున్నారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. బుధవారం ఆయన రాయదుర్గం నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చదం గ్రామంలో ఉన్న క్రషర్ సిబ్బందిపై ఎమ్మెల్యే అనుచరులు భౌతికంగా దాడి చేసి, హింసించిన ఘటన మరువక ముందే, ఇంకో గ్రానైట్ క్వారీ యజమానిని బెదిరించిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చిందన్నారు. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపైన, అతని ప్రధాన అనుచరుడు ఈ దందాకు నాయకత్వం వహిస్తున్న గాలి ఆమర్నాథ్ రెడ్డిల పైన ఇటీవల శశినారాయణ అనే వ్యక్తి జిల్లా ఎస్పీ కి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. క్వారీ ఆక్రమణ వెనుక స్వయంగా ఎమ్మెల్యే "కాపు" ఉన్నాడని శశినారాయణ అనే వ్యక్తి స్పష్టంగా ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. ఇటీవల ఆమర్నాథ్ రెడ్డి వాహనం శశినారాయణ క్వారీలోకి ప్రవేశించిందన్నారు.
ఆమర్నాథ్ రెడ్డి తన వాహనానికి ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అధికారిక స్టిక్కర్ వాడినట్లు తెలుస్తోందన్నారు. ఎమ్మెల్యే కాపు అతని ప్రధాన అనుచరుడు గాలి అమర్నాథ్ రెడ్డి లు ఇటీవల రాష్ట్ర డీజీపీ రాజేంద్ర రెడ్డిని కలిసిన ఫోటోను చూపించి బెదిరిస్తున్నట్లు గ్రానైట్ ఓనర్ శశినారాయణ ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. ఆమర్నాథ్ రెడ్డి బెదిరింపుల నుండి తనను కాపాడమని శశినారాయణ ఎమ్మెల్యేను ప్రాధేయపడితే, ఎమ్మెల్యే "కాపు" గానైట్ క్వారీని తనకు అప్పగించి రాయదుర్గం నుండి వెళ్లిపోవాలని హుకుం జారీ చేసినట్లు కూడా బాధితుడి ఫిర్యాదులో ఉందన్నారు. హోస్పెట్ లో మహాలక్షి అమ్మవారిని ఆరాధిస్తూ, గ్రానైట్ నుండి వచ్చిన ఆదాయాన్ని ఆశ్రమాన్ని అభివృద్ధి చేయుటకు వెచ్చిస్తుంటే ఎమ్మెల్యే అనుచరులు తనని బెదిరిస్తున్నారని శశినారాయణ ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో చాలా స్పష్టంగా వివరించారన్నారు. స్థానిక పోలీసులను ఆశ్రయించినా ఉపయోగం ఉండదని, ప్రభుత్వ అధికారులు అందరూ తన చేతిలో ఉన్నారని ఎమ్మెల్యే "కాపు" తనను బెదిరించినట్టు బాధితుడు తెలిపారన్నారు. ఎమ్మెల్యే కాపు తనకున్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని, పోలీసులను ఉపయోగించి వ్యాపారస్తులను బెదిరించడంపై కాలవ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 లో అలవుకాని హామీలతో ఎమ్మెల్యేగా గెలిచిన కాపు రామచంద్రా రెడ్డి చేసిన అవినీతి, అరాచక, అక్రమాలు చూసి సామాన్య ప్రజలు భయకంపితులవుతున్నారన్నారు. చదం గ్రామంలో క్వారీ సిబ్బందిపై కాపు అనుచరులు చేసిన దాడిపై యజమాని ఎస్పీకి చేసిన ఫిర్యాదుపై పోలీసులు ఇంత వరకు చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. కనేకల్లులో రోడ్డు కాంట్రాక్టర్ పై వైసీపీ నాయకుడు జయరామి రెడ్డి చేసిన బెదిరింపులపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. నెమకల్లులోని ఎమ్మెల్యే క్వారీలో జరుగుతున్న అక్రమాలపై పోరాడిన బిజెపి నేత హీరోజి రావుపై వైసీపీ నాయకులు హత్యాయత్నం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అనుచరుడు మాదవ రెడ్డి ఇంటి అక్రమ నిర్మాణంపై పోరాడిన లోక్ సత్తా బాబుపై నడి రోడ్డులో దాడి చేసింది వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా సోషక్ మీడియాలో పోస్టులు పెడుతున్న మారుతీపై రాంపురంలో దాడి చేయించింది ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కాదా అని నిలదీశారు.
ఇసుక రీచ్ లో ఉన్న ఉద్యోగి డబ్బులు ఇవ్వలేదని ఫోన్లో బెదిరించి, దుర్భాషలాడింది నిజం కాదా అని ప్రశ్నించారు. నెమకల్లు క్వారీలో అక్రమ బ్లాస్టింగ్ లపై ఫిర్యాదు చేసిన టీడీపీ నాయకులపై ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు బనాయించింది నిజం కాదా అంటూ కాలవ శ్రీనివాసులు ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా గెలిచిన కాపు రామచంద్రారెడ్డి రెడ్డి విలేకరి ఆవుల మనోహర్ తో మొదలైన దాడుల పరంపర గ్రానైట్ క్వారీల వరకు తొమ్మిది సంఘటనలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయన్నారు. వ్యాపారస్తులు, క్రషర్, క్వారీ యజమానులు కాపు బెదిరింపులకు జడుసుకుంటున్నారన్నారు. కోట్లు పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేసుకొంటున్న వారిపై దౌర్జన్యాలు చేస్తుంటే అధికార యంత్రాంగం, వ్యవస్థ ఏమి చేస్తోందని కాలవ ప్రశ్నించారు. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రెడ్డి మూడేళ్లలో చేసిన అవినీతి అక్రమాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసులు, అధికారులు ఎందుకు కాపు అవినీతి, అక్రమాలకు కళ్లెం వేయలేకపోతున్నారన్నారు. కాపు రామచంద్రారెడ్డి కనుసన్నల్లో వ్యవస్థ అక్రమాలకు "కాపు" కాస్తే ప్రజల్ని ఎవరు కాపాడుతారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి పోరాళ్ల పురుషోత్తం, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు గాజుల వెంకటేశులు, జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షుడు జమీల్ ఖాన్, నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు కడ్డిపూడి మహబూబ్ బాషా, మండల కన్వీనర్ హనుమంత రెడ్డి, సిమెంట్ శీనా తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa