గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారూ! రాజన్న రాజ్యమంటేనే రైతన్న రాజ్యమని మీరు ఇచ్చిన భరోసా ఆచరణలో ఎక్కడా కనిపించడంలేదు. పొలాల వద్దే రైతుల నుంచి పంటలని మద్దతు ధరకి కొనుగోలు చేస్తామని మీరు ఇచ్చిన హామీ ఏమైంది? ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో రైతాంగం నుంచి పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు జరపకుండానే రబీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం చాలా అన్యాయం. 2021-22 ఖరీఫ్ సీజన్ లో 39.15 లక్షల ఎకరాలలో వరి సాగు కాగా, 83 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. ప్రభుత్వం 5,312 రైతుభరోసా కేంద్రాల ద్వారా 40.48 లక్షల టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసింది. ఇంకా 42 లక్షల టన్నులకి పైగా ఖరీఫ్ ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. ఖరీఫ్ ధాన్యం సగం కూడా కొనకుండానే రబీ కొనుగోలు కేంద్రాలను ఎలా ప్రారంభించారో అర్థం కావడంలేదు.
రబీ ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొంటున్నారంటే అదీ లేదు. రైతాంగం నుంచి 50 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామనే ప్రభుత్వ ప్రకటనకీ ఆమడదూరంలో కొనుగోళ్లు ఆపేశారు. 2020-21 ఖరీఫ్ సీజన్‌లో 47.32 లక్షల టన్నుల ధాన్యం సేకరించిన ప్రభుత్వం ఈ ఏడాది 40.48 లక్షల టన్నులకే పరిమితమైంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 7 లక్షల టన్నులకి పైగా ధాన్యం సేకరణ తగ్గింది. అరకొర ధాన్యం కొనుగోలు చేసి రైతులకు రూ.1000 కోట్లు వరకూ బకాయిలు పెట్టేశారు. క్వింటా ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఏ గ్రేడ్ రూ.1,960, సాధారణ రకం రూ.1,940గా నిర్ణయించినా రైతులకు ఆ మేరకు ధర దక్కడంలేదు. రైతుభరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయకపోవడం..ఒకవేళ కొనుగోలు చేసినా సకాలంలో సొమ్ము ఇవ్వకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మిల్లర్లు, దళారులకు క్వింటా 1300కి రైతులు ధాన్యం అమ్ముకుంటున్నారు.
రైతుభరోసా కేంద్రాలు పెట్టినా, ఈ-క్రాప్ బుకింగ్లో నిర్లక్ష్యంతో 70శాతం మంది రైతులు ధాన్యం అమ్ముకోలేక తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులకు అవగాహన కల్పించాల్సిన రైతుభరోసా కేంద్రాలు వైసీపీ సేవలో తరిస్తున్నాయి. పండించిన ధాన్యం కొనుగోలు జరగక, పెట్టుబడులకు తెచ్చిన అప్పులు వడ్డీలు పెరిగి రైతులు దయనీయ స్థితిలో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఖరీఫ్‌లో పండిన మొత్తం ధాన్యం పంటని మద్దతు ధరతో కొనుగోలు చేయాలి. వేలకోట్లకి చేరిన ధాన్యం బకాయిలు తక్షణమే చెల్లించాలి. ఈ క్రాప్ బుకింగ్ గురించి రైతులకు అవగాహన కల్పించి అందరూ నమోదు చేసుకునేలా చేయాలి. రబీ సీజన్‌లోనైనా మొత్తం ధాన్యం కొనుగోలుకి ఏర్పాట్లు చేయాలి.