ఎంకి పెళ్లి సుబ్బిచావుకు తెచ్చిందటా అన్న సామెత ఇపుడు రష్యా, ఉక్రెయిన్ మధ్య సాగుతున్న యుద్దం వల్ల సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులతో సరిగా సరిపోతుంది. రష్యా-ఉక్రెయిన్ల మధ్య నెలకొన్న సంక్షోభ ప్రభావం దేశంపై పడుతోంది. ఇప్పటికే పెట్రోల్-డీజిల్ ధరలు, సీఎన్‌జీ, ఎల్‌పీజీ ధరలు, పాల ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. అంతర్జాతీయంగా పెరుగుతోన్న క్రూడాయిల్ ధరలు ఎఫ్‌ఎంసీజీ కంపెనీలపై ప్రభావం చూపుతున్నాయి. కంపెనీల ఖర్చులు పెరుగుతున్నాయి. దీంతో ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు తమ వ్యూహాన్ని మార్చేశాయి. చాలా ప్రొడక్టుల ప్యాకేజింగ్ సైజులను కంపెనీలు తగ్గించాయి. అమ్మకాలను పెంచుకునేందుకు కంపెనీలకు ఇది సహకరించనుంది.
దేశంలో అతిపెద్ద ఎఫ్‌ఎంసీజీ కంపెనీ హిందూస్తాన్ యూనీలివర్(హెచ్‌యూఎల్) గత ఆరు నెలలుగా ధరలు పెంచుతూనే ఉంది. సోపుల ధరలను 2 శాతం నుంచి 17 శాతం పెంచింది. గత ఆరు నెలల్లో చాలా ప్రొడక్టుల ధరలను 25 శాతం నుంచి 30 శాతానికి పెంచింది కంపెనీ. రెండు నిమిషాల మ్యాగీ ధర కూడా రూ.2 పెంచింది. దీంతో మ్యాగీ ప్యాకెట్ ధర రూ.12 నుంచి రూ.14కు పెరిగింది. పార్లే ప్రొడక్టుల ధరలు కూడా 10 శాతం నుంచి 15 శాతం పెరుగుతాయని అంచనాలున్నాయి.
ధరలు పెరుగుతుండటంతో.. కన్జూమర్లు తమ ఖర్చులను తగ్గించారు. పెద్ద ప్యాకెట్ల బదులు చిన్న ప్యాకెట్లనే ఎక్కువగా కొంటున్నారు. దీంతో కంపెనీలు కూడా తమ వ్యూహాన్ని మార్చుకున్నాయి. ప్రొడక్టుల ప్యాకెట్ సైజులను 10 శాతం వరకు తగ్గించాయి కంపెనీలు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న సంక్షోభంతో.. మూడు కమోడిటీలు క్రూడాయిల్, పామాయిల్, గోధుమల ధరలు పెరిగాయి. ఈ మూడు ఎఫ్‌ఎంసీజీ కంపెనీలకు ముఖ్యమైన ముడి సరుకులు. గత ఏడాది కాలంగా క్రూడాయిల్ ధరలు 124 శాతం వరకు పెరిగాయి. క్రూడాయిల్ ధరలు పెరగడంతో.. ప్యాకేజింగ్ ఇండస్ట్రీ రామెటీరియల్ ఖర్చులు కూడా పెరిగాయి. ప్యాకేజింగ్ మెటీరియల్ ఖరీదైనవిగా మారాయి. అంతేకాక బల్క్ డీజిల్, కోల్ కొనుగోళ్ల ఖర్చులు కూడా కంపెనీలకు తడసి మోపడవుతున్నాయి.
దీంతో ఎఫ్‌ఎంసీజీ కంపెనీలకు 20 శాతం నుంచి 30 శాతం వరకు ఖర్చులు పెరిగాయి. ఈ భారాన్ని వినియోగదారులకు బదలాయించేందుకు కంపెనీలు కొన్ని ప్రొడక్టుల ధరలను పెంచాయి. అంతేకాక ప్యాకెట్ సైజులను తగ్గించడం ప్రారంభించాయి. పార్లే, బ్రిటానియా, హల్దీరామ్, హెచ్‌యూఎల్ వంటి ప్రొడక్టుల ప్యాకెట్ సైజులను కంపెనీలు తగ్గించాయి. మరోవైపు సోపుల సైజులు కూడా తగ్గిపోయాయి.