ఇతర రాష్ట్రాల ప్రభుత్వాల కంటే భిన్నంగా అలోచించిన ఏపీ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను రూపొందించింది. సచివాలయల్లో ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల సేవలను అందిస్తుంది. అయితే సేవలను అందిస్తున్న సచివాలయ సిబ్బందికి తగినంత వేతనం మాత్రం చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం అవుతుంది. నిత్యం ఏదో ఒక సర్వే, అవగాహన కార్యక్రమం, పథకాల పేరుతో క్షణం తీరిక లేకుండా నిబద్దతో పని చేస్తున్న ఆరకొర జీతంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. దానికి తోడు రాజకీయ ప్రమేయం వలన తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నామని వారు వాపోతున్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 872 గ్రామ సచివాలయాలు 442 వార్డు సచివాలయాలు మొత్తం 1314 సచివాలయాలు ఉన్నాయి. వీటిలో సుమారుగా 11 వేలకు పైగా సిబ్బంది పని చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో సచివాలయ సిబ్బంది పాత్ర ఎంతో కీలకం. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్టోబర్ 2వ తేదీ 2019 నుంచి సచివాలయ వ్యవస్థను అందుబాటులోనికి తీసుకు వచ్చింది. సిబ్బంది ఎంపిక కోసం జిల్లా కమిటీలను ఏర్పాటు చేసి మరీ సిబ్బందిని నియమించారు. రూ.15 వేల జీతం అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం అని ఎంతో మంది నిరుద్యోగులు పెద్ద చదువులు చదివిన వారు కూడా సిబ్బంది గా జాయిన్ అయ్యారు. వీరికి అప్పట్లో కాస్తోకూస్తో శిక్షణ ఇచ్చి ఈ బాధ్యతలను అప్పగించారు. రెండు సంవత్సరాల వీరి ప్రభుత్వ ప్రొహిబిషన్ పీరియడ్ పూర్తయి పర్మినెంట్ కోసం ఎదురు చూస్తున్నారు.
అయితే సిబ్బంది కార్యాలయానికి వస్తున్న సందర్భంలో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేసింది. వేలిముద్రలు లేనిపక్షంలో వీరి జీతాన్ని కట్ చేసి చెల్లించే విధంగా ప్రభుత్వం విధి విధానాలను రూపొందించి ప్రస్తుతం అమలు కూడా చేస్తుంది. కొన్ని చోట్ల సర్వర్ సమస్య తలెత్తడం మూలంగా బయోమెట్రిక్ యంత్రాలు పనిచేయట్లేదు. ఫీల్డ్ వర్క్ వెళ్లేవారికి బయోమెట్రిక్ విధానం పెద్ద సమస్యగా మారుతుంది. ఆలస్యమైతే జీతంలో కోత పెడుతూ కఠిన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంది. ఒకసారి ఆలస్యమైతే రూ. 116, రెండోసారి రూ, 333 మూడోసారి రూ. 500 కోతను విధిస్తున్నారు. దీనికితోడు వారంలో ఒకరోజు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై స్థానికులకు అవగాహన కల్పించేందుకు ప్రతి ఇంటినీ సందర్శించాలని ఉన్నతాధికారులు చెబుతున్నారు.
ప్రజలకు పాలన చేరువ చేసే క్రమంలో ఏర్పాటు చేసిన సచివాలయాలకు ఆర్థిక కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. కార్యాలయాల నిర్వహణ అడ్మిన్ లకు పెద్ద సమస్యగా మారిందని చెప్పాలి. వాటి నిర్వహణకు అవసరమైన సామాగ్రిని ప్రభుత్వం అందించినప్పటికీ రోజువారి, నెలవారీ ఖర్చుల కోసం స్పష్టత లేదు. జిల్లాలో ఉన్న ఎన్నో సచివాలయాలు అద్దె భవనాల్లో ప్రస్తుతం గ్రామపంచాయతీలు చెల్లిస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో కార్యాలయానికి వచ్చిన వారితోనే అవసరమైన కాగితాలు, ఇతర సామాగ్రి చెప్పించు కోవాల్సి వస్తుంది. ఉన్నతాధికారులు దీనిపై సత్వర చర్యలు తీసుకొని కార్యాలయాల నిర్వహణ కోసం నిధులను కేటాయించాలని కోరుతున్నారు.