వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఈ ఏడాది మామిడిలో దిగుబడి తగ్గింది. అయితే, చేతికందిన కాయలు, పండ్లను సరైన పద్ధతుల్లో నిల్వ, రవాణా చేస్తే కొంతైనా లాభాలు పొందే అవకాశం ఉంది. ఈ క్రమంలో మామిడి కోతతో పాటు నిల్వ, రవాణా చేసే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం .
- లేత ఆకు పచ్చ రంగు కలిగిన కాయలనే కోయాలి.
- వాటిలో చక్కెర శాతం ఉన్న కాయలనే కోయాలి.
- ఉదయం 10 లోగా కోత పని పూర్తి చేయాలి.
- కాయమీద ఉండే చర్మానికి సొన అంటకుండా జాగ్రత్త తీసుకోవాలి.
- కాయ కోసిన తర్వాత తప్పనిసరిగా సొన కార్చేలా చూడాలి. ఇందుకోసం కాయ తొడిమెలను 0.5 సెం.మీ. నుంచి 1 సెం.మీ. వరకు కత్తెరతో కత్తిరించాలి. వాటిని తలకిందులుగా పెట్టి, రెండు మూడు గంటలపాటు కదిలించకుండా ఉంచాలి. అప్పుడే కాయల నుంచి సొన కారుతుంది.
- కోతల సమయంలో కాయలపై చిన్న మచ్చగానీ, దెబ్బగానీతగలకుండా జాగ్రత్త పడాలి.
- అపెడా సంస్థ ధృవీకరించిన ప్యాక్‌హౌస్ లోనే మామిడి కాయలను శుద్ధి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం 52 సెం.గ్రే. ఉష్ణోగ్రత గల నీటిలో 200 పీపీఎం సోడియం హైపోక్లోరైట్ కలపాలి. ఈ ద్రావణంలో కాయలను ఉంచి, 2-3 నిమిషాల పాటు శుద్ధి చేయాలి.
- కాయల రవాణా సమయంలో అంత్రాక్నోస్, పండు ఈగల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. వీటి నివారణకు కాయలను 48 +0.3 సెం.గ్రే. ఉష్ణోగ్రత కలిగిన నీటిలో గంటపాటు శుద్ధిచేయాలి.
- ప్యాకింగ్ కోసం టెలిస్కోపిక్ కార్గేటెడ్ ఫైబర్ బోర్డ్ (సైజు 390 * 260 * 150) బాక్సులను వాడాలి. వీటిని 6 గంటలలోపే ప్యాక్ హౌస్‌కు తరలించాలి.
- ఇతర దేశాలకు ఎగుమతి చేసే పండ్లకు తప్పనిసరిగా ఇర్రాడియేషన్ చేయించాలి. ఒకసారి కోతకు ఉపయోగించిన పనిముట్లను శుభ్రం చేశాకే మళ్లీ వాడాలి.