దేశంలోనే మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ అవార్డుకు తనను ఎంపిక చేయడంపై హీరో అజిత్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో తన తండ్రి జీవించి ఉంటే బాగుండేదంటూ భావోద్వేగానికి గురయ్యారు. ప్రభుత్వానికి, పరిశ్రమలో తనకు సహకరించిన వారికి, అభిమానులకు కృతజ్ఞతలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.‘పద్మభూషణ్ పురస్కారానికి నన్ను ఎంపిక చేసిన భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రికి హృదయపూర్వక ధన్యవాదాలు.. ఇది కేవలం వ్యక్తిగత ప్రశంస మాత్రమే కాదు. సినీ పరిశ్రమలో ఎంతోమంది నాకు సహకరించారు. వారి సహకారంతోనే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా. వారందరి కృషి, మద్దతుకు నిదర్శనమే ఈ పురస్కారం. రేసింగ్, షూటింగ్‌లో నాకు సహకారం అందించిన వారికి కృతజ్ఞతలు’ అని అజిత్ పేర్కొన్నారు. ‘ఈ రోజు నా తండ్రి జీవించి ఉంటే బాగుండేది. నన్ను చూసి ఆయన గర్వించేవాడు. నా విజయానికి, సంతోషానికి నా భార్య షాలిని సహకారం ఎంతో ఉంది. గడిచిన 25 ఏళ్లుగా ఆమె సహకారంతోనే ఈ విజయం సాధించా. నా అభిమానుల అచంచలమైన ప్రేమ, మద్దతు వల్లే నేను అంకితభావంతో పనిచేయగలుగుతున్నా. ఈ అవార్డు మీ అందరిది’ అంటూ అజిత్ తన పోస్టులో చెప్పుకొచ్చారు.