by Suryaa Desk | Fri, Dec 20, 2024, 03:31 PM
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ ఈవెంట్ లో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, నేటి అసెంబ్లీ సమావేశంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ అంశంపై చర్చకు బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. నినాదాలు చేస్తూ వెల్ లోకి దూసుకురావడంతో సభలో ఉద్రిక్తత నెలకొంది.ఈ పరిణామంపై ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను ఆర్డర్ లో పెట్టాలంటూ స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు సభలో జరిగింది పదేళ్ల బీఆర్ఎస్ పాలనను తెలియజేస్తోందని విమర్శించారు. ఎమ్మెల్యేలు ఎవరైనా ప్రజల సమస్యలను ప్రస్తావించడానికి సభకు రావాలి కానీ, ఇలా గందరగోళం సృష్టించడానికి కాదంటూ అసహనం వ్యక్తం చేశారు. సభలో నేడు జరిగింది బీఆర్ఎస్ సంస్కృతికి నిదర్శనమని అన్నారు. బీఆర్ఎస్ సభ్యులకు కేసీఆర్ బోధించింది ఇదే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ధరణి ఒక కుటుంబం కోసం, ఒక పార్టీ కోసమే తెచ్చారని ఆరోపించారు. భూమి ఆడిటింగ్ జరగాలని పదేళ్లుగా డిమాండ్ చేస్తున్నానని, కానీ తన డిమాండ్ ను బీఆర్ఎస్ ఏనాడూ పట్టించుకోలేదని ఒవైసీ పేర్కొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమైనా భూముల ఆడిటింగ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.కాగా, సభలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు.