దేశంలో సార్వత్రిక ఎన్నికల నాలుగో దశ పోలింగ్ కొనసాగుతోంది. నాలుగో దశలో ఏపీ, తెలంగాణ సహా.. పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. 1717 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నాలుగో విడత పోలింగ్‌లో భాగంగా ఏపీలోని 25 లోక్ సభ స్థానాలతోపాటు తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెల్లవారుజామునుంచే ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని క్యూ లైన్లలో నిలుచుంటున్నారు. ఎండ వస్తే తట్టుకోలేమని భావించిన ఓటర్లు.. ఉదయం 7 గంటల లోపే పోలింగ్ బూత్ లకు చేరుకుంటున్నారు. ఇక తెలంగాణలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 52 శాతం పోలింగ్ నమోదైంది. ఇక పలు చోట్ల ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటోంది.
ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదైంది. ప్రిసైడింగ్ అధికారితో దురుసుగా ప్రవర్తించడంతో మంగళ్ హట్ పోలీస్ స్టేషన్‌లో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు చేశారు.
మాధవీలతపై కేసు నమోదు
మరోవైపు.. హైదరాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొంపెల్లి మాధవీలతపై కేసు నమోదు అయింది. ఓటు వేసేందుకు వచ్చిన ముస్లిం మహిళల బురఖాలు తీసి వారి గుర్తింపు కార్డులను తనిఖీ చేయగా.. కొందరు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేశారు.
ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీసమేతంగా వెళ్లి ఓటు వేశారు. కొడంగల్‌లోని ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఓటు హక్కు వినియోగించుకున్న కేసీఆర్ దంపతులు
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు.. తన స్వగ్రామం సిద్దిపేట జిల్లా చింతమడకలో ఓటు వేశారు. సతీమణి శోభతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
తమ తమ నియోజకవర్గాల్లో ఓటు వేసిన మంత్రులు
నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుటుంబంతో కలిసి వెళ్లి ఓటు వేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ బస్సులో వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఖమ్మం జిల్లా మధిరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ములుగు జిల్లా జగ్గన్నపేటలో మంత్రి సీతక్క, గొల్లగూడెంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కల్లూరు మండలం నారాయణపురంలో మంత్రి పొంగులేటి, సూర్యాపేట జిల్లా కోదాడలో మరో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఓటు వేశారు.
ఓటు వేసిన కేటీఆర్
బంజారాహిల్స్‌లోని నందీనగర్‌లో ఉన్న జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్‌లో మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఓటు వేశారు. సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షుతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక హైదరాబాద్‌లో పలువురు సెలబ్రిటీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన సతీమణితో కలిసి వచ్చి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓబుల్ రెడ్డి స్కూల్‌లో ఓటు వేశారు. ఇక సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తన భార్యతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ తరఫున ఎంపీ అభ్యర్థి మాధవీలత కూడా తన ఓటు వేశారు. ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వేశారు. జూబ్లీహిల్స్ లోని పోలింగ్ కేంద్రాానికి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. లైన్లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఓబుల్ రెడ్డి స్కూల్‌లో సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్, తన సతీమణి ప్రణతి, తల్లి షాలినితో కలిసి క్యూ లైన్‌లో నిలబడి ఓటు వేశారు. ఇక ఫిలింనగర్‌లోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలోని పోలింగ్ స్టేషన్‌లో ఐకాాన్ స్టార్ అల్లు అర్జున్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మలక్‌పేటలోని సలీంనగర్ జీహెచ్ఎంసీ కమ్యూనిటీ సెంటర్‌లో త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనా రెడ్డి దంపతులు ఓటు వేశారు.
ఓటింగ్‌ను బహిష్కరించిన ప్రజలు
ఇక పలు చోట్ల జనం ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం కనుముక్కలలో గ్రామస్థులు పోలింగ్‌ను బహిష్కరించారు. తడిసిన ధాన్యం బస్తాలతో పోలింగ్ కేంద్రానికి వచ్చిన రైతులు ధర్నాకు దిగారు. ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రాయమాదారం వాసులు ఎన్నికలను బహిష్కరించారు. ఎన్‌ఎస్పీ కాలువపై వంతెన నిర్మించలేదంటూ పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. కడెం మండలం అల్లంపల్లిలో రోడ్డు వేయలేదని గ్రామస్థులు ఓటింగ్ లో పాల్గొనడం లేదు. నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం మైలారంలో గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు. మైనింగ్ ఎన్‌వోసీ అనుమతులు రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఏప్రిల్ 19న దేశంలో ఎన్నికలు ప్రారంభం కాగా.. ఇప్పటి దాకా 285 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించారు. తొలి దశలో 66.71 శాతం పోలింగ్ నమోదు కాగా.. రెండో దశలో 66.14 శాతం, మూడో దశలో 64.4 శాతం పోలింగ్ నమోదైంది. నాలుగో దశలో పోలింగ్ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిశా, జార్ఖండ్‌ల్లోని 4 నియోజకవర్గాలు, బిహార్‌లోని 5 సీట్లు, మధ్యప్రదేశ్‌లోని 8 నియోజకవర్గాలు, మహారాష్ట్రలోని 11, యూపీలోని 13 నియోజకవర్గాలు, పశ్చిమ బెంగాల్‌లోని 8 నియోజకవర్గాలు, జమ్మూ కశ్మీర్‌లోని ఒక నియోజకవర్గంలో నేడు పోలింగ్ జరుగుతోంది. ఏపీ అసెంబ్లీకి కూడా ఈ దశలోనే ఎన్నికలు జరుగుతోన్న సంగతి తెలిసిందే.
లోక్ సభ ఎన్నికలు.. ఏపీ, తెలంగాణ సహా దేశంలోని 96 నియోజకవర్గాల్లో పోలింగ్.. నాలుగో దశలో అత్యధికంగా తెలంగాణలోని 17 నియోజకవర్గాల నుంచి 525 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఏపీలో 25 లోక్ సభ స్థానాలకు 454 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మహారాష్ట్రలోని 11 స్థానాల్లో 209 మంది బరిలో ఉండగా.. యూపీలోని 13 స్థానాల నుంచి 130 మంది పోటీ చేస్తున్నారు. బెంగాల్‌లోని 8 నియోజకవర్గాల నుంచి 75 మంది పోటీలో నిలిచారు. తెలంగాణలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కూడా నేడు ఉపఎన్నిక జరుగుతోంది.
సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేత అధీర్ రంజన్ చౌధురీ, మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, టీఎంసీ మహువా మొయిత్రా, వైఎస్ జగన్ సోదరుడు అవినాశ్ రెడ్డి, సోదరి షర్మిల; మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర రెడ్డి, బండి సంజయ్, కిషన్ రెడ్డి, పురంధేశ్వరి, కిరణ్ కుమార్ రెడ్డి, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, కేశినేని నాని తదితర ప్రముఖులు నాలుగో దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
నాలుగో దశ పోలింగ్ కోసం ఏప్రిల్ 18న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగా.. ఏప్రిల్ 25వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించారు. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 29 వరకు అవకాశం కల్పించారు. 96 స్థానాలకు కలుపుకొని 4264 నామినేషన్లు వచ్చాయి. ఎన్నికల సంఘం వడపోత అనంతరం 1970 నామినేషన్లు మిగిలాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాక చివరకు 1717 మంది బరిలో నాలుగో దశ నిలిచారు.
వైన్స్ షాపుల మూసివేత పొడిగింపు..
లోక్ సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో సోమవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూతపడిన సంగతి తెలిసిందే. అయితే పోలింగ్ తర్వాత అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా చూడటం కోసం.. హైదరాబాద్ నగర పరిధిలో మంగళవారం ఉదయం 6 గంటల వరకు వైన్స్ దుకాణాలను మూసి ఉంచాలని హైదరాబాద్ సీపీ ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa