ఐఏఎస్‌గా ఎంపికై, శిక్షణలో భాగంగా తన కార్యాలయానికి వచ్చిన కుమార్తెకు తండ్రి సెల్యూట్ చేస్తున్న అపురూప దృశ్యమిది. ఏ తండ్రికైనా అంతకంటే గొప్పదైన సంతోషం మరొకటి ఉంటుందా! గర్వకారణమైన విషయం. ఆ కుమార్తె గుండె ఉప్పొంగే సందర్భం. హైదరాబాద్‌లో చోటు చేసుకున్న ఈ అపురూప సన్నివేశం అందరిలో స్ఫూర్తి నింపేలా ఉంది. తెలంగాణకు చెందిన పోలీస్ అధికారి నూకల వెంకటేశ్వర్లు గతంలో నారాయణపేట జిల్లా ఎస్పీగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ పోలీస్ అకాడమీలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన కుమార్తె నూకల ఉమాహారతి.. గతేడాది యూపీఎస్సీ సివిల్స్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించారు. ప్రస్తుతం శిక్షణ తుది దశలో ఉన్నారు.
కుమార్తెకు తండ్రి సెల్యూట్
ట్రైనీ ఐఏఎస్‌గా తన సహచరులతో కలిసి శనివారం (జూన్ 15) తెలంగాణ పోలీస్ అకాడమీకి వచ్చారు ఉమాహారతి. అక్కడ తన కుమార్తెను చూసి ఎస్పీ ర్యాంకు అధికారి వెంకటేశ్వర్లు గర్వించారు. హృదయం ఉప్పొంగిపోగా తన కుమార్తెకు సెల్యూట్ చేశారు. కూతురికి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఉమా హారతి సోదరుడు కూడా..
2023 మే 23న వెలువడిన సివిల్స్ (2022) ఫలితాల్లో ఉమా హారతి ఆలిండియా మూడో ర్యాంక్ సాధించారు. అంతకంటే ఒక్క రోజు ముందే ఆమె తమ్మడు సాయి వికాస్ ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్ అధికారిగా ముంబైలో బాధ్యతలు తీసుకున్నారు. ఐఈఎస్ పరీక్షలో ఆయన ఆలిండియా 9వ ర్యాంక్ సాధించారు. నాడు వేంకటేశ్వర్లు నారాయణపేట ఎస్పీగా పనిచేస్తున్నారు. కుమార్తె, కుమారుడు.. ఇద్దరూ ఒకేసారి ఉన్నత ఉద్యోగాలకు ఎంపికవ్వడం ఒక తండ్రిగా ఆయనకు గర్వకారణమైన సందర్భం.
ఉమా హారతి స్వస్థలం, విద్యాభ్యాసం
నూకల వేంకటేశ్వర్లు స్వస్థలం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్. ఉమాహారతి విద్యాభ్యాసం హైదరాబాద్‌లో సాగింది. చిన్ననాటి నుంచి ఆమె చదవులో చురుగ్గు ఉండేవారు. ఐఐటీ, ముంబై నుంచి సివిల్స్ ఇంజినీరింగ్ విభాగంలో పట్టా పుచ్చుకున్నారు. పదో తరగతి వరకు భారతీయ విద్యా భవన్‌లో చదువుకున్నారు.
సజ్జనార్ సార్‌తో ఉమా హారతి
టీజీఎస్ ఆర్టీసీ లో అమలు చేస్తోన్న పలు కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు ట్రైనీ ఐఏఎస్‌లు శుక్రవారం బస్ భవన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఉమాహారతి తాను అభిమానించే అధికారి సజ్జనార్‌ను కలిసి మురిసిపోయారు. ఆయనకు ఒక పుస్తకం కానుకగా ఇచ్చారు. టీజీఆర్టీసీ సంస్థ ఉన్నతాధికారులతో కలిసి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సంస్థ ద్వారా చేస్తున్న కార్యక్రమాలను ట్రైనీ ఐఏఎస్‌లకు వివరించారు. ఆర్టీసీ పనితీరు, ఉద్యోగుల సంక్షేమం, మహాలక్ష్మి పథకం అమలు తీరు, ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలపై ట్రైనీ ఐఏఎస్‌లకు సజ్జనార్ అవగాహన కల్పించారు.
హైదరాబాద్‌లో ఐఏఎస్‌లకు ప్రాక్టికల్ ట్రైనింగ్
తెలంగాణ కేడర్‌కి చెందిన 2023 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్‌లు ప్రస్తుతం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్-హెచ్ఆర్డీ)లో ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రాం శిక్షణ తీసుకుంటున్నారు. బస్ భవన్‌ను సందర్శించిన వారిలో ట్రైనీ ఐఏఎస్‌లు ఉమాహారతి, గరిమా నరులా, మనోజ్, మృణాల్, శంకేత్, అభిజ్ఞాన్, అజయ్ ఉన్నారు.
శిక్షణ ఇచ్చిన ఉన్నతాధికారులు
బస్ భవన్‌లో టీజీఎస్‌ఆర్టీసీ సంస్థ సీవోవో డాక్టర్ రవీందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వ రావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్‌లతో పాటు ఎంసీఆర్ హెచ్ఆర్డీ సీడీఎస్ సెంటర్ హెడ్ డాక్టర్ కందుకూరి ఉషారాణి, నోడల్ ఆఫీసర్ శ్రీనివాస్, తదితరులు ట్రైనీ ఐఏఎస్‌లకు కీలక అంశాలు వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa