హైదరాబదాద్, శివారు ప్రాంతాల్లో అనేక చెరువులు కబ్జాకు గురైన విషయం తెలిసిందే. గతంలో నీటితో కళకళలాడిన చెరువుల్లో ప్రస్తుతం పెద్ద పెద్ద బిల్డింగ్‌లు, నిర్మాణాలు వెలిశాయి. నగరంలో భూముల ధరలకు రెక్కలు రావటంతో కొందరు కబ్జారాయుళ్లు చెరువులు, కుంటలను ఆక్రమించారు. ఫలితంగా చిన్నపాటి వర్షాలకే నగరంలోని పలు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. దీంతో చెరువుల పరిరక్షణకు నడుం బిగించిన ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం 'హైడ్రా'ను ఏర్పాటు చేసింది.
ఇప్పటికే నగరంలోని అనేక ప్రాంతాల్లో చెరువులు, కుంటలు కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. గత మూడు నెలల కాలంలో వందల కట్టడాలను కూల్చేశారు. ఇక నుంచి చెరువులు కబ్జాకు గురి కాకుండా వాటిని కాపాడేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. చెరువులు, కుంటలను ఎవరూ ఆక్రమించకుండా రంగారెడ్డి జిల్లా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పక్కాగా లెక్కలు రెడీ చేస్తున్నారు. గ్రామ నక్షాలు, డిజిటల్ సర్వేల సహాయంతో వాటి విస్తీర్ణాన్ని, ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ల పరిధిని నిర్ణయిస్తున్నారు. ప్రతి చెరువుకు పక్కా లెక్కలతో జియోట్యాగ్ ఏర్పాటుచేసి హైడ్రా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు.
హైదరాబాద్ శివారులో 1075 చెరువులుండగా ఇప్పటికే 107 చెరువులకు జియో ట్యాగింగ్ పూర్తి చేశారు. అనంతరం వాటి వివరాలను హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌లో ఉంచారు. రెవెన్యూ అధికారుల సర్వేలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. చెరువుల సమీపంలో వెంచర్లు వేసిన కొందరు బఫర్‌జోన్లలో కొన్ని స్థలాలను ఆక్రమించుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి ఆక్రమణలు ఎక్కువగా శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, గండిపేట, శంషాబాద్ ప్రాంతాల్లో ఉన్నట్లు తేలింది.
50కి పైగా చెరువుల బఫర్‌జోన్, ఎఫ్‌టీఎల్‌లను కొందరు కబ్జాకోరులు మార్చేశారు. ఆయా చెరువుల్లో నిర్మించిన అక్రమాలను కూల్చేసి.. పక్కాగా హద్దులు నిర్ణయిస్తున్నారు. అందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాల్లో రెవెన్యూ అధికారులతో పాటుగా, ఇరిగేషన్, మున్సిపల్, హైడ్రా అధికారులు ఉన్నారు. ప్రాధాన్య ప్రాంతాల్లోని చెరువుల్లో కొన్నింటికి గుర్తించి ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నారు. వెబ్‌సైట్‌లో ఆయా చెరువుల వివరాలతో పాటు ప్రతి చెరువు ఎఫ్‌టీఎల్ ప్రాంతాన్ని జియో ట్యాగింగ్ చేస్తున్నారు.