తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్ దారులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. ఇక మీదట మెడికల్ బిల్లుల రియింబర్స్ మెంట్ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరమే లేని సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక నుంచి మొత్తం ఆన్‌లైన్ ద్వారానే మెడికల్ బిల్లులను సబ్మిట్ చేయాలని.. తద్వారా నిధుల మంజూరు ప్రక్రియ మరింత వేగవంతమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇకపై ఉద్యోగులు మెడికల్ రియంబర్స్‌మెంట్ దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా స్వీకరించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు.. హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖకు ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది.
అయితే.. దీనిపై అతి త్వరలోనే కార్యాచరణ సైతం చేపట్టనున్నట్లు సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం మెడికల్ రియంబర్స్‌మెంట్ కోసం ఆస్పత్రికి సంబంధించిన బిల్లులను నేరుగా తీసుకొని పరిశీలించేవారు. అయితే.. ఇకపై ఆన్‌లైన్ ద్వారా మాత్రమే మెడికల్ బిల్లులను సబ్మిట్ చేయాలని.. తద్వారా పని ఇంకాస్త వేగవంతం పూర్తవుతుందని.. ఫలితంగా డబ్బులు కూడా త్వరగా అందుతాయని అధికారులు వివరిస్తున్నారు.
గతంలో నేరుగా ఆస్పత్రి బిల్లులను సబ్మిట్ చేయడం వల్ల.. వాటిని పరిశీలించి, ఫండ్ రిలీజ్ చేసేందుకు ఎక్కువ సమయం పట్టేదని.. ప్రస్తుతం ఆన్‌లైన్ ద్వారా తీసుకోవడం వల్ల పనితీరు వేగవంతమయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఫలితంగా.. ఉద్యోగులు, పెన్షన్ దారులకు వైద్య చికిత్స సమయంలోనే డబ్బులు వేగంగా అందే ఛాన్స్ ఉందని పేర్కొంటున్నారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 నుంచి 30 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నట్టు అంచనా. గతంలో ఎవరైనా అనారోగ్యం బారినపడి ఆసుపత్రి పాలైనా లేదా ఏదైనా ఆపరేషన్లు చేయించుకున్నా.. ప్రభుత్వం నుంచి మెడికల్ రియంబర్స్‌మెంట్ చేసేది. అయితే.. 50 వేల రూపాయల చికిత్సకు సంబంధించిన మెడికల్ బిల్లులను జిల్లా స్థాయిలో సబ్మిట్ చేయాల్సి వచ్చేది. ఇక 2 లక్షల రూపాయలు దాటిన బిల్లులను డీఎంఈ స్థాయిలో మంజూరు చేయాల్సి వచ్చేది. అంతకు మించిన బిల్లులను సర్కారు ప్రత్యేకంగా వేసిన కమిటీ పరిశీలించాల్సి వస్తుంది. అయితే ఈ ప్రక్రియ చాలా సమయంలో కూడుకున్నది. ఈ పద్ధతి వల్ల ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం కూడా ఉంది.
వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం.. ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించింది. మెడికల్ బిల్లుల రియంబర్స్‌మెంట్ డీఎంఈ నుంచి కాకుండా ఇకపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా నిర్వహించాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఆరోగ్య శ్రీ ట్రస్టులో నిపుణులైన వైద్యులు ఈ బిల్లులను పర్యవేక్షిస్తారని.. ఫలితంగా మరింత వేగంగా.. బిల్లుల మొత్తాన్ని జారీ చేసే ఛాన్స్ ఉంటుందని భావిస్తోంది.
గతంలో.. బిల్లుల స్క్రూటీనీ కోసం నెల నెలా దాదాపు 4 నుంచి 5 వేల బిల్లులు వచ్చేవని.. కానీ సిబ్బంది కొరత వల్ల కేవలం 150 బిల్లులను మాత్రమే పరిశీలించడానికి సమయం లభించేదని అధికారులు చెప్తున్నారు. దీంతో వేలాది బిల్లులు పెండింగ్‌లో పడిపోయేవి. అయితే.. ఈ సమస్యకు పరిష్కారం దిశగా ఆలోచించిన ప్రభుత్వం.. ఈ ఆన్‌లైన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తోందని అధికారులు చెప్తున్నారు.