ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐఐటీ స్టూడెంట్ అత్యుత్తమ అవధాని ఎలా అయ్యారు..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 12, 2024, 07:48 PM

ఆరేళ్ల వయస్సులోనే పాట రాశాడు.. పదేళ్లకే శతకం రాశాడు.. పదహారేళ్లకే అవధానం చేసే స్థాయికి ఎదిగాడు.. 20 ఏళ్లలోపే 19 అష్టావధానాలు చేసాడు. కష్టపడి తన ప్రతిభతో ఐఐటీలో చేరి అటు సాంకేతిక విద్యలోనూ రాటు తేలుతూ.. ఇటు అవధానవిద్య, ఆర్షధర్మ సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ అవధానిగా.. ధార్మికవేత్తగా.. సాహితీవేత్తగా విశేష ప్రతిభ కనబరుస్తున్నాడు. అతడే హైదరాబాద్ నగరానికి చెందిన నల్లాన్ చక్రవర్తుల సాహిత్. అతడి విజయగాథ ఎందరికో స్ఫూర్తిదాయకం. మరెందరికో ఆదర్శం. ఐఐటీ స్టూడెంట్ అత్యుత్తమ అవధాని ఎలా అయ్యారో ఇప్పుడు తెలుసుకుందాం.


నల్లాన్ చక్రవర్తుల సాహిత్. హైదరాబాద్ నగరానికి చెందిన సాహిత్.. ప్రస్తుతం ఐఐటీ ఖరగపుర్‌లో ఎలక్ట్రిక్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. సాహిత్ తల్లిదండ్రులు.. రంగాచార్యులు, అనురాధ. చిన్నప్పటి నుంచి చురుగ్గా ఉండే సాహిత్ ఆరేళ్ల వయస్సులోనే పాట రాసే స్థాయికి చేరుకున్నారు. ఆడుకునే వయసులోనే సాహితీ ప్రయాణాన్ని మెుదలు పెట్టాడు. దేవుడు ప్రసాదించిన ప్రత్యేక జ్ఞానంతో సాహిత్యం, అవధానంలో అంచలంచెలుగా ఎదిగాడు. 20 ఏళ్లలోపే 19 అష్టావధానాలు చేసాడు. మూడేళ్ల క్రితం.. శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ స్థాపించిన అవధాన విద్యా వికాస పరిషత్ వేదికగా ప్రథమ అష్టావధానం చేశాడు. ఇప్పటి వరకు పలు వేదికలుగా 19 అవధానాలు పూర్తి చేశాడు. ఆన్‌లైన్‌లోనూ ఒక అవధానం చేశాడు.


రాజమహేంద్రవరంలో ప్రతిష్ఠాత్మకమైన ఆంధ్ర యువతీ సంస్కృత కళాశాలలో అవధాని ప్రాచార్య శ్రీ ధూళిపాళ మహాదేవమణి ఆశీస్సులతో "శతావధాన శరచ్చంద్ర" శ్రీ తాతా సందీప్ శర్మ గారి సంచాలనంలో అవధానం చేసి "అవధాన కళా కౌముది" అన్న బిరుదును పొందాడు. జగద్గురు శ్రీమద్రామానుజాచార్య స్వామి వారి సమతాకుంభ్ మహోత్సవంలో శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారి సమక్షంలో "సమతామూర్తి" ప్రాంగణంలో అవధానం చేసే మహాభాగ్యం దక్కించుకున్నాడు.


ఐఐటీ ముంబైలో, ఐఐటీ తిరుపతి వంటి సాంకేతిక విద్యా సంస్థల్లోనూ అవధానాలు చేసే అదృష్టాన్ని సాహిత్ దక్కించుకున్నాడు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ప్రౌద్యోగిక సాహిత్యిక సంస్థలో సభ్యునిగా హిందీలో, ఇంగ్లీష్‌లో కూడా కవిత్వం రాసి వేదికపై ప్రదర్శించారు. ఇలా చిన్న వయస్సులోనే తన సాహితీ ప్రయాణాన్ని ప్రారంభించి.. అవధానంతో అందరి మన్ననలు పొందుతున్న సాహిత్ ప్రయాణం ఎందరికో స్పూర్తిదాయకం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com