ఇందిరా గాంధీని బీజేపీ ప్రధాని అయిన వాజ్‌పాయి కాళీమాతతో పొల్చారని పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. 10 నెలల కాలంలో జీఏస్టీ రూపంలో రూ.37 వేల కోట్లను కేంద్రం వసూలు చేసిందని తెలిపారు. మరి తెలంగాణకు కేంద్రం ఎంతిచ్చిందని ప్రశ్నించారు. దీన్ దయాల్ అంత్యోదయ, దీన్ దయాల్ గృహజ్యోతి లాంటి పేర్లు పథకాలకు కేంద్రం ఎందుకు పెట్టిందని ప్రశ్నించారు. వాళ్లు ఏమైనా దేశం కోసం ప్రాణత్యాగం చేశారా.. అని మండిపడ్డారు. భారతీయులు ఇందిరమ్మను ఇంకొక్క మాట అన్న ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ నుంచి ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు ఒక్క రూపాయైనా రాష్ట్రానికి అదనంగా తెచ్చారా.. అన్న ప్రశ్నకు ముందుగా బండి సంజయ్ సమాధానం చెప్పాలని పొన్నం ప్రశ్నించారు.
అయితే.. మొన్ననే కరీంనగర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు.. పాల్గొన్నారు. ఈ సభలో ప్రసంగించిన బండి సంజయ్.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పొన్నం ప్రభాకర్‌తో తనకు ఎలాంటి గ్యాప్స్ లేవని.. అన్ని పోయాయన్నారు. గంగుల కమలాకర్‌తో కూడా ఎలాంటి గ్యాప్స్ లేవని.. ఉన్న చిన్న చిన్న గ్యాప్స్ కూడా పోతాయని చెప్పుకొచ్చారు. కానీ.. ఆ మాట చెప్పిన తెల్లారే.. మేయర్ సునీల్ రావు కార్పొరేటర్లను పట్టుకుని బీజేపీలో చేరిపోయారు. కాగా.. ఇప్పుడు ఎలాంటి గ్యాప్స్ లేవన్న పొన్నం ప్రభాకర్.. బండి సంజయ్‌కి వార్నింగ్ ఇవ్వటం గమనార్హం.