పద్మ పురస్కార విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని , అవార్డుల విషయంలో కేంద్రం తెలంగాణపై వివక్ష చూపిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రం సిఫార్సు చేసిన వారికి పురస్కారాలు ఇవ్వలేదని ఆక్షేపించారు. రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా.. డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తాము చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, గద్దర్, జయధీర్ తిరుమలరావు పేర్లు సిఫార్సు చేసినా పట్టించుకోలేదని అన్నారు. ఏపీకి ఐదు అవార్డులు ఇచ్చారని... తెలంగాణకు నాలుగైనా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పద్మ అవార్డుల విషంలో చూపిన వివక్షపై కేంద్రానికి లేఖ రాస్తానని చెప్పారు.
ఇక వీసీల నియామకం యూజీసీ ద్వారా చేపట్టే యత్నం జరుగుతోందని రేవంత్ అన్నారు. యూజీసీ ద్వారా కేంద్రం పెత్తనం చేసే ప్రయత్నం మంచిది సరైంది కాదని అన్నారు. వర్సిటీల స్వయం ప్రతిపత్తి హరించాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు. వర్సిటీలపై రాష్ట్ర హక్కును కేంద్రం ఎలా తీసుకుంటుందని ప్రశ్నించారు. కేంద్రం కుట్రలను ఎలాగైనా అడ్డుకోవాల్సిందేనని పిలుపునిచ్చారు. ఇతర రాష్ట్రాల సీఎంలతో కలిసి యూజీసీ నిబంధనలపై పోరాడతామన్నారు. యూజీసీ కొత్త నిబంధనలు రాజ్యాంగంపై దాడి వంటివేనని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాలపై కేంద్రం దండయాత్ర చేస్తోందని.. ఇలాంటి విధానాలతో రాజ్యాంగం మనుగడ సాగిస్తుందా? అని ప్రశ్నించారు. కేంద్రం తక్షణమే యూజీసీ నిబంధనలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
తెలుగు రాష్ట్రాలకు ఏడు అవార్డులు.. కాగా, 2025 ఏడాదికి గానూ కేంద్రం మొత్తం 139 మందిని పద్మ పురస్కారాలకు ఎంపిక చేసింది. వీరిలో ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మంది పద్మ భూషణ్, 113 మందిని పద్మ శ్రీ అవార్డులను ప్రకటించారు. 23 మంది మహిళలు, 10 మంది ఎన్నారైలు, ఇతర దేశాలకు చెందిన వారికి పద్మ పురస్కారాలకు ఎంపిక చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఏడుగురికి అవకాశం దక్కింది. తెలంగాణ నుంచి డాక్టర్ దువ్వూరు నాగేశ్వర్ రెడ్డికి (వైద్యం) పద్మ విభూషణ్, మందకృష్ణ మాదిగ (ప్రజా వ్యవహారాలు) పద్మ శ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. ఏపీ నుంచి టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ (కళలు) -పద్మభూషణ్, KL కృష్ణ (సాహిత్యం) -పద్మశ్రీ, మాడుగుల నాగఫణి శర్మ (కళలు) పద్మశ్రీ, వద్దిరాజు రాఘవేంద్రాచార్య (సాహిత్యం)- పద్మశ్రీ, మిర్యాల అప్పారావ్ (కళలు)- పద్మ శ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు.