తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చేందుకు గాను ప్రస్తుతం హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డుకు దాదాపు 40 కి.మీ దూరంతో ప్రాజెక్టు చేపట్టారు. ఇప్పటికే 161 కి.మీతో నిర్మిస్తున్న ఉత్తర భాగానికి కేంద్రం టెండర్లు ఆహ్వానించింది. త్వరలోనే టెండర్ల ప్రక్రియ నిర్వహించనున్నారు. ఇక దక్షిణ భాగం పనులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం వేగం పెంచింది. ఆర్థిక నిర్వహణ, ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్, వ్యూహాత్మక రోడ్డు మ్యాప్ డిజైన్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు సలహాలు, సూచనలు అందించడానికి రేవంత్ సర్కార్ తాజాగా మరో కన్సల్టెన్సీ సంస్థ కోసం టెండర్లను పిలిచింది.
కన్సల్టెన్సీ సంస్థలు బిడ్లను సమర్పించడానికి ఫిబ్రవరి నెల 25న మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం కల్పించారు. ఇందులో రీజినల్ రింగు రోడ్డు దక్షిణభాగం నిర్మాణానికి కావాల్సిన నిధులను ఏ విధంగా సమకూర్చుకోవాలి? ఏ విధంగా ఖర్చు చేయాలి ? తదితర అంశాలతో పాటు సౌత్ పార్ట్ రోడ్డు మ్యాప్, ఇరువైపుల రోడ్డు ఎలైన్‌మెంట్ ఎలా ఉండాలి? భూసేకరణ అంశాలు, వీటి పర్యవేక్షణ కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు? వంటి బాధ్యతలను ఎంపికైన కన్సల్టెన్సీ సంస్థకు ప్రభుత్వం అప్పగించనుంది. ఉత్తర భాగం పనులకు సమాంతరంగా దక్షిణ భాగం పనులను కూడా చేపట్టేందుకు సర్కార్ సిద్ధమైంది.
గతేడాది డిసెంబరు 28న ఉత్తరభాగం పనులను చేపట్టడానికి కేంద్రం టెండర్లను ఆహ్వానించింది. ఈ పనులను ఐదు ప్యాకేజీల్లో డిసైడ్ అయ్యారు. నాలుగు వరుసల రహదారితో గ్రీన్‌ఫీల్డ్ రీజినల్ ఎక్స్‌ప్రెస్‌వేగా ఈ రోడ్డును భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(NHAI) అభివృద్ధి చేయనుంది. ఈ టెండర్లకు ఫిబ్రవరరి నెల 14 వరకు బిడ్‌లను దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు. అదే నెల 17న బిడ్లను తెరవనున్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తయితే ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తరభాగం పనులు వెంటనే ప్రారంభమవుతాయి. కేంద్రం చేపట్టే ఉత్తరభాగం పనులకు సమాంతరంగా దక్షిణభాగం పనులను కూడా తామే చేపడుతామని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అందులో భాగంగానే తాజాగా కన్సల్టెన్సీ టెండర్లను పిలిచినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే సగం తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. 60 శాతం వరకు పట్టణీకరణ పూర్తవుతుందని సర్కార్ భావిస్తోంది.