ఫోన్ వేడెక్కడం, ఛార్జింగ్ పెట్టిన ఫోన్ బాగా వేడెక్కి పేలిపోవడం ఇలాంటి సమస్యలు వేసవిలోనే ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో మొబైల్ యూజర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కొన్ని బ్యాటరీ సేవింగ్స్ టిప్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
- ఎండలో స్మార్ట్‌ఫోన్ ఉపయోగించొద్దు. అలా చేస్తే ఫోన్ ఇంకా వేడెక్కిపోతుంది. కాబట్టి సూర్యకాంతి మొబైల్ పై నేరుగా పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
- ఫోన్ ఛార్జర్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఛార్జర్ పాడైందని మార్కెట్లో ఏది పడితే అది కొని వాడొద్దని నిపుణులు చెబుతున్నారు. కంపెనీ ఛార్జర్లు మాత్రమే వాడాలని సూచిస్తున్నారు. ఒకవేళ కంపెనీ ఛార్జర్లు పాడైతే అదే కంపెనీకి చెందిన ఒరిజినల్ ఛార్జర్లను మాత్రమే కొనుగోలు చేయాలని చెబుతున్నారు.
- ఫోన్ పగిలినా, చిన్న డ్యామేజ్ అయినా రిపేర్ చేయించాకే వాడాలి. డ్యామేజ్ అయిన స్మార్ట్‌ఫోన్లు వేగంగా వేడెక్కి, పేలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందట.
- చాలా మంది నిద్రపోయే ముందు ఫోన్ ఛార్జింగ్ పెడుతుంటారు. రాత్రంతా ఛార్జ్ పెట్టి, ఉదయాన్నే లేచాక తీసేస్తారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే ఫోన్ బ్యాటరీ సామర్థ్యం దెబ్బతినే అవకాశం ఉంటుందంటున్నారు. లేదంటే తాజాగా వచ్చే స్మార్ట్‌ఫోన్లలో ఆటోమేటిక్ పవర్ సప్లయ్ ఫీచర్ ఉంటుంది. దాన్ని టర్న్ ఆన్ చేసుకుంటే సరి. నిర్దేశించిన ఛార్జింగ్ తర్వాత ఆటోమేటిగ్గా ఛార్జింగ్ అగిపోతుంది.
- కొంతమంది బ్లూటూత్, లోకేషన్ సర్వీసెస్ వంటి ఫీచర్లు ఎల్లప్పుడూ ఆన్‌లోనే ఉంచుతారు. అవసరం లేనపుడు ఈ ఆప్షన్లను టర్నాఫ్ చేయడమే మంచిదని చెబుతున్నారు. లేదంటే ఫోన్‌పై ఎక్కువ లోడ్ పడుతుందని, బ్యాటరీ సామర్థ్యం తగ్గిపోతుందని చెబుతున్నారు.
- స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ బ్రైట్ నెస్ కూడా బ్యాటరీ సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. వీలైనంత వరకు దీన్ని తక్కువలో ఉంచడమే మంచిది. లేదంటే స్మార్ట్‌ఫోన్లలో ఆటోమేటిక్ స్క్రీన్ బ్రైట్‌నెస్ మోడ్‌ను యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది.
- మొబైల్‌లో వాడని యాప్స్‌ను వెంటనే డిలీట్ చేయాలి. ఆ యాప్స్‌ను ఉపయోగించకపోయినా బ్యాగ్రౌండ్‌లో రన్ అవుతూ ఉంటాయి. దీనివల్ల బ్యాటరీ సామర్థ్యం తగ్గుతుంది. కాబట్టి వీటిని వెంటనే డిలీట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.