ఎండలు మండిపోతున్నాయి. మార్చిలోనే మే నెలను గుర్తుకు తెస్తున్నాయి. మున్ముందు రోజుల్లో ఎండలు మరింత మండిపోతాయని వాతావరణ శాఖ చెబుతోంది.ఈ ఎండలకు భయపడి చాలామంది బయటకు వెళ్లరు. మరి అత్యవసరమైన పని ఉన్నవాళ్లు కచ్చితంగా వెళ్లాల్సిందే. అలాంటివారు ఎండలకు ఊరికే నీరసపడిపోతారు. చెమట రూపంలో శరీరంలో లవణాలను కోల్పోతారు. ఇలాంటప్పుడు శరీరానికి శక్తి కావాల్సి ఉంటుంది. ఆ శక్తిని భర్తీ చేయడానికి ఎన్నో పండ్లు ఉన్నాయి. అలాంటి పండ్లల్లో.. కర్బూజ ముఖ్యమైనది. ఇది ఎండాకాలంలో ఎక్కువగా లభిస్తుంది.వాస్తవానికి కర్బూజ పండును తర్బూజ అని కూడా పిలుస్తారు. ఈ పండు ఆఫ్రికా ఖండంలో పుట్టింది. ఆ తర్వాత మధ్యధరా దేశాల మీదుగా ఐరోపా, దక్షిణాఫ్రికా, ఆసియా దేశాలకు విస్తరించింది. ఈ పండును పశ్చిమ ఆఫ్రికాలో విస్తారంగా సాగు చేస్తారు. అయితే అక్కడి ప్రజలు పండుగ విత్తనాల కోసం సాగు చేయడం విశేషం. అయితే ఈ పండు మొదట్లో ఈ స్థాయిలో తీయగా ఉండేది కాదట. కొంచెం చేదుగా ఉండేదట. దీనిని అనేక రకాలుగా అభివృద్ధి చేసి తీపి రకాన్ని ఆవిష్కరించారట. ఇప్పుడు ఆ తీపి రకం విత్తనాల కాయలనే మనం తింటున్నాం. అందువల్లే కర్భూజ పండుకు వేసవిలో విపరీతమైన డిమాండ్ ఉంటుంది.
కర్బూజ పండును ఈజిప్టు ప్రజలు నాలుగువేల సంవత్సరాల క్రితమే సాగు చేశారట. అక్కడి ప్రాచీన సమాధుల మీద ఉన్న చిత్రాల ఆధారంగా చరిత్రకారులు ఈ విషయాన్ని గుర్తించారు. మరణం తర్వాత తన పూర్వీకులు దాహం తీర్చుకోవడానికి ఈ పండ్లు ఉపకరిస్తాయని అక్కడి ప్రజలు నమ్మేవారట. గ్రీకు దేశస్తులు కర్బూజ కాయను పెపాన్ అని పిలుస్తారు. చిన్నపిల్లలకు గుండెపోటు వస్తే కర్బూజ తొక్కలను తల మీద పెట్టి చికిత్స చేసేవారట. కర్భూజ ను శరీరానికి చల్లదనాన్ని కలిగించే ఆహారంగా గ్రీకు దేశస్థులు భావించే వారట. కర్బుజా కాయ ఈ 1856లో వివాదాలకు కూడా కారణమైంది. వాటర్ మెలన్ రాయట్.. తెలుగులో చెప్పాలంటే కర్బూజ దొమ్మి అనే ఘటన చోటు చేసుకుంది. అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి ఓ రైలు బయలుదేరింది. అది ఆ ఏడాది ఏప్రిల్ 15న పనామా రాజధానికి చేరుకుంది. అక్కడ దిగిన ఒక వ్యక్తి దగ్గర్లో ఉన్న పండ్ల దుకాణానికి వెళ్ళాడు. ఓ కర్బూజ ముక్క తీసుకున్నాడు. డబ్బులు చెల్లించకపోవడంతో.. ఆ వ్యాపారి గట్టిగా అడిగాడు. దీంతో ఆ ప్రయాణికుడు తుపాకీ తీశాడు. ఆ వ్యాపారి కూడా అంతే ఆవేశంగా తన దగ్గర ఉన్న కత్తి తీసి దాడి చేయబోయాడు. దీంతో ఆ ఘటన చినికి చినికి గాలి వాన లాగా మారింది. చివరికి అమెరికన్ ప్రయాణికులు, స్థానికుల మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణలో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. మరి కొంతమంది గాయపడ్డారు.
కర్భూజను పాలస్తీనా దేశస్తులు తమ దేశ జెండాగా మార్చుకున్నారంటే ఆ పండుకున్న ఘనతను అర్థం చేసుకోవచ్చు. పాలస్తీనా ప్రజలు కర్భూజను శక్తివంతమైన చిహ్నంగా భావిస్తారు. ఇది ఇజ్రాయిల్ – హమాస్ యుద్ధంలో ఒక రాజకీయ సాధనంగా మారిందంటే అతిశయోక్తి కాదు. 1967లో ఇజ్రాయిల్ పాలస్తీనాకు చెందిన వెస్ట్ బ్యాంక్, గాజా నగరాలను ఆధీనంలోకి తీసుకుంది. ఆ ప్రాంతాల్లో పాలస్తీనా జెండా ఎగరకుండా నిషేధం విధించింది. దీంతో పాలస్తీనా ప్రజలు తమ జాతీయ జెండా రంగులైన ఎరుపు, నలుపు, తెలుపు, ఆకుపచ్చకు ప్రత్యేకగా కర్బూజ చిత్రాన్ని తమ జాతీయ జెండాపై రూపొందించారు. అనంతరం ఆ జెండాలను ఎగరేశారు. ఇప్పుడు ఇజ్రాయిల్ చేస్తున్న దాడులు నేపథ్యంలో సోషల్ మీడియాలో పాలస్తీనా ప్రజలు కర్భూజ పండు ను ముద్రించిన జెండాలను ప్రదర్శిస్తున్నారు.కర్భూజ పండులో 92 శాతం నీరు ఉంటుంది. పండుగా తిన్నా, పండ్ల రసంగా తాగిన ఒకే రకమైన ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇందులో విటమిన్ ఏ, సీ పుష్కలంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని, కంటి చూపును అవి మెరుగుపరుస్తాయి. జీర్ణ క్రియను పెంపొందిస్తాయి. కర్భూజా లో ఉండే లైకోపీన్ అనే ఆరోగ్యకరమైన కొవ్వును పెంపొందిస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఇది రుచికి తియ్యగా ఉన్నప్పటికీ ఇందులో కేలరీలు, కొవ్వులు తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మలబద్ధకాన్ని నివారిస్తుంది. లవణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వేసవికాలంలో దీనిని తరచూ తీసుకుంటే శరీరానికి నీరసం అనేది రాదు. ఇంకా కొన్ని అధ్యయనాల్లో ఇది క్యాన్సర్ ను కూడా నివారిస్తుందని తేలింది.