మహారాష్ట్రలో బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతిచెందారు. జాట్ జిల్లా సాంగ్లీ సమీపంలోని విజపుర-గుహనగర్ జాతీయ రహదారిపై కారును ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ఉన్నవారు తీవ్రంగా గాయపడి.. ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. వీరంతా తమ బంధువుల ఇంటి పెళ్లికి వెళ్లి తిరిగొస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు వలస కూలీలతో జాట్ నుంచి ముంబయికి వెళ్తున్నట్టు అధికారులు తెలిపారు. వేగంగా వచ్చిన కారు.. బస్సు ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు.
అతివేగమే ప్రమాదానికి కారణమని, కారుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని చెప్పారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో ఉన్న ప్రయాణికులకు కూడా గాయాలుకావడంతో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 10 నుంచి 12 మంది వరకూ గాయపడ్డారని, వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. పోలీసులు కేసు నమోదుచేసుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ప్రమాద స్థలంలో దృశ్యాలు అత్యంత భయంకరంగా ఉన్నాయి. ప్రమాద తీవ్రతకు కారు ముందు ఛిద్రమైపోయింది. డ్రైవర్, ముందు సీటులోని ఉన్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయి.. లోపలి ఇరుక్కున్నారు. మృతదేహాలను అతికష్టంతో లోపలి నుంచి బయటకు తీశారు.